సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కాంగ్రెసోళ్లు, బీజెపోళ్లు ఎప్పుడూ ఢిల్లీకి గులాములేనని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశానికి హాజరై మాట్లాడుతూ… కాంగ్రెస్ వాళ్లకు, బీజేపీ వాళ్లకు తెలంగాణపై ప్రేమ ఉండదని, తెలంగాణ కోసం ఆరాటపడేది ఒక్క కేసీఆర్ మాత్రమే అన్నారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఏడాది గడవకముందే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని, నలుగురు కలిసిన ప్రతిచోట ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్లినా, ఏ సభకు హాజరైనా కేసీఆర్ ను తిట్టడం తప్ప హామీలను మాత్రం అమలు చేయడం లేదన్నారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ అమలు కాలేదని, కళ్యాణ లక్ష్మితో పాటు బంగారం ఇవ్వడం లేదని, మహిళలకు 2500 అందించడం లేదని, పింఛన్లు 4000 చేయలేదని ప్రజలు ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారన్నారు. ప్రజలు విరుచుకుపడుతున్న తీరు చూస్తే రోషమున్నోడు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారని ఎద్దేవా చేశారు.
సిరిసిల్ల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజన్నను దర్శించుకుని నాలుగు మంచి మాటలు మాట్లాడతాడని భావించానని, అయితే కేసీఆర్ ను తిట్టడం వరకే సరిపోయిందన్నారు. రాష్ట్రంలో నేతన్నలు ఎక్కువగా ఉన్న ప్రాంతం సిరిసిల్ల అని పవర్ లూమ్ లు మొత్తం ఇక్కడ ఉంటే వేములవాడలో నూలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28సార్లు ప్రజాధనం కోట్ల రూపాయలు వృధా చేసి ఢిల్లీకి పోయాడని 28 రూపాయలు కూడా తేలేకపోయాడన్నారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు 8 నెలల్లో తెలంగాణకు ఎనిమిది రూపాయలు కూడా తేలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రజల కోసం కాకుండా అదానీ కోసం, అల్లుడి కోసం, అన్నల కోసం, బావమరిది కోసం పనిచేస్తున్నారన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్ లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 60లక్షల రూపాయలు ధర పలికే భూములను తక్కువ ధరలకు లాక్కోవాలని ప్రయత్నిస్తే ప్రజలు 9నెలలుగా నిరసనలు తెలియజేస్తున్న వారి సమస్య పరిష్కరించడంలో సీఎం పూర్తిగా విఫలమయ్యాడన్నారు.
కనీసం వారితో మాట్లాడే మనిషి కరువయ్యాడని, అందుకే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన అధికారులను అడ్డుకున్నారన్నారు. అదే సీఎం రేవంత్ వెళ్తే ఉరికిచ్చి కొట్టే వాళ్ళని, అమాయకులను జైలులో పెట్టి వేధిస్తున్నారని, తగిన గుణపాఠం తప్పదన్నారు. తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా కేసీఆర్ దీక్ష చేపట్టి చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. అభివృద్ధి దిశలో ప్రయాణిస్తున్న రాష్ట్రం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్ళగానే దివాలా తీసిందన్నారు. తీవ్రమైన ప్రజా వ్యతిరేకత అనిపిస్తోందని ఒక్క పిలుపునిస్తే ప్రభుత్వానికి సంవత్సరీకం పెట్టే పరిస్థితి నెలకొందన్నారు. ఈనెల 29న తలపెట్టిన దీక్షా దివస్ కు తెలంగాణ వాదులు, ప్రజలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలన్నారు.