Tuesday, November 26, 2024

ఈసారి 70శాతమే సిలబస్.. ఖరారు చేసిన ఇంటర్ బోర్డు..

ప్ర‌భ‌న్యూ్స్: ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల సిలబస్‌పై ఇంటర్‌ బోర్డు ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. 70 శాతానికే ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఉంటాయని ప్రకటించింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా 30 శాతం సిలబస్‌ను తగ్గించి, 70 శాతం సిలబస్‌నే ఖరారు చేసినట్లుగా ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ సోమవారం ప్రకటించారు. అయితే కరోనా నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా ప్రభుత్వ అనుమతి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా బోర్డు కార్యదర్శి వెల్లడించారు. ప్రతి సంవత్సరం జూన్‌ 1న కళాశాలలు ప్రారంభమవుతుంటాయి. కానీ రాష్ట్రంలో కరోనా తీవ్రత దృష్ట్యా ఈ విద్యాసంవత్సరం జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లోనూ కళాశాలలు తెరుచుకోలేదు.

దీంతో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేసిన తర్వాత సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించారు. 280 రోజుల పాటు క్లాసులు నడవాల్సి ఉండగా, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ కలుపుకుంటే 220 రోజులు మాత్రమే క్లాసులు జరగనున్నాయి. 47 రోజుల పాటు ఆన్‌లైన్‌ క్లాసులు కొనసాగగా, ఇంకా 173 రోజుల పాటు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేలా అధికారులు అకాడమిక్‌ క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ నేపత్యంలోనే 2021-22 విద్యాసంవత్సరానికి గానూ ఇంటర్‌లో 70 శాతం సిలబస్‌ను ఖరారు చేస్తూ ది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) అప్పటికే నిర్ణయం తీసుకుంది.

ఈమేరకు తెలంగాణ ఇంటర్‌ బోర్డుకు సీబీఎస్‌ఈ లేఖను పంపించింది. దీంతో ఇంటర్‌ బోర్డు అధికారులు సైతం 70 శాతం సిలబస్‌కు అనుమతివ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో 70 శాతం సిలబస్‌ను ఖరారు చేసినట్లుగా అధికారులు ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement