Thursday, September 12, 2024

TG: ఇది అన్యాయ‌మే… కూల్చివేత‌ల‌పై డీకే అరుణ ఫైర్

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 2 (ప్రభ న్యూస్) : మహబూబ్ నగర్ పట్టణంలోని 523 సర్వేనెంబర్ ఆదర్శనగర్ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేదలు, అంధుల ఇండ్లను ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్న ఫలంగా రాత్రికి రాత్రే కూల్చేయడం ముమ్మాటికీ అన్యాయమేనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పాలమూరు ఎంపీ డీకే అరుణ మండపడ్డారు. సోమవారం ఆమె స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించి అందులు, నిరుపేద బాధితులతో నేరుగా మాట్లాడి విషయం తెలుసుకుని వారిని పరామర్శించి ఓదార్చారు.

అంతేకాక బాధితులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటానని భరోసాను ఇచ్చారు. అనంతరం ఘటనా స్థలం నుండి ఆమె స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, తహసీల్దార్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పేదల ఇండ్లు ఎందుకు కూల్చాల్సి వచ్చిందనే విషయంఫై అరాతీశారు. పూర్తిస్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆమె సూచించారు. కాయాకష్టం చేసి 75 గజాల్లో ఇండ్లు కట్టుకుంటే ఓర్వలేనితనంతో కూలగొట్టడం దారుణమని విమర్శించారు. ఇక్కడి పరిస్థితి చూస్తుంటే కళ్ళకు నీరు వస్తోందని, గతంలో వీళ్లంతా ఇండ్ల నిర్మాణం కోసం దరఖాస్తులు చేసుకున్నారని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వ‌రూ ధనికులు కాదని, వీళ్లందరికీ ఇక్కడే ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అవసరమైతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వీళ్లందరికి తొలి ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు.బాధితులకు న్యాయం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి న్యాయం చేసేలా చూస్తామని బాధితులను ఇంకా వేదించొద్దని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ అచుగట్ల అంజయ్య,నాయకులు కృష్ణవర్ధన్ రెడ్డి, పాండురంగారెడ్డి, కె . సతీష్ కుమార్,సంపత్ కుమార్ , జాజం సుబ్రహ్మణ్యం, పోతుల రాజేందర్ రెడ్డి, నవీన్ రెడ్డి,విరాన్న, యాదయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement