టీచింగ్ ఫ్యాకల్టీ లేక బోధనకు అవస్థలు
ఆరు వేల మంది బాలికలకు నలుగురే కేర్ టేకర్లు
చీఫ్ వార్డెన్ శ్రీధర్‌ను తొలగించాలి
ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందు విద్యార్థుల గోడు
ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ : బాసర ట్రిపుల్ ఐటీలో ఏళ్ల తరబడి సమస్యలు ఎదుర్కొంటున్నా… పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందు గోడు వెళ్ళబోసుకున్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య నేతృత్వంలో కమిషన్ ఆకస్మికంగా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించింది.
సమస్యలపై ఆరా…
వైస్ చాన్స్‌లర్ వెంకటరమణతో కమిషన్ సమావేశమైంది. అనంతరం సమస్యలపై ఆరా తీసింది. వసతుల లేమి, టీచింగ్ ప్యాకల్టీ కొరత, కేర్ టేకర్ల కొరతపై కమిషన్ కు విద్యార్థులు ఏకరువు పెట్టారు. ఆరు వేల మంది విద్యార్థులకు కేవలం నలుగురు కేర్లు మాత్రమే ఉన్నారని, తమ సమస్యలు ఎవరికి చెప్పినా అర్థం కావని కమిషన్ ముందు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. చీఫ్ వార్డెన్ శ్రీదర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.
చీఫ్ వార్డెన్ శ్రీధర్ ను విధుల నుంచి తొలగించాలి…
తాము ముందస్తు సమాచారం ఇచ్చినా సమావేశానికి చీఫ్ వార్డెన్ శ్రీధర్ గైర్హాజర్ కావడం పట్ల ఎస్సీ, ఎస్టీ కమిషన్ సీరియస్ అయ్యింది. ఆయన్ను వెంటనే విధుల నుండి తొలగించాలని వైస్ ఛాన్సర్ కు సూచించింది. ఆరు వేల మంది బాలికలకు నలుగురు మాత్రమే కేర్ టేకర్లు ఉండటంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేర్ టేకర్లను వెంటనే పెంచాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
టీచింగ్ ఫ్యాకల్టీ లేక…
విద్యార్థులకు సరిపడా ఫ్యాకల్టీ లేకపోవడంతో ఉన్నత విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వాపోయారు. ప్రభుత్వం ఫ్యాకల్టీ నియామకాలపై కసరత్తు చేస్తుందని ఇంఛార్జ్ వీసీ వెంకటరమణ కమిషన్‌కు వివరించారు. వీలైనంత త్వరగా ఈ సమస్య తీర్చాలని, వారి చదువులకు ఆటంకం కలగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ కమిషన్ సూచించింది.