ఆ ఘనత రేవంత్, భట్టిలదే
ఏ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేయలేదు
అలా చేసిన గౌరవం కాంగ్రెస్ ప్రభుత్వానిదే
ఆంద్రప్రభ స్మార్ట్ ..హైదరాబాద్ – దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఒక ప్రభుత్వం రూ.2 లక్షల రుణ మొత్తాన్నీ మాఫీ చేయడం అందరూ ఈ రోజు చూస్తున్నారని బ్యాంకర్లను ఉద్దేశించి అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. హైదరాబాద్ ప్రజాభవన్‌లోనేడు జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనకు తెలిసి మీ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని సందర్భం అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టిలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక దీక్షతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు.. తాము ఈ పథకం ప్రకటించి ఓకేసారి మాఫీ చేస్తామని చెప్పినప్పుడు చాలా మంది బ్యాంకర్లు కు కూడా నమ్మకం కుదరలేదన్నారు. దానికి కారణం కూడా లేక పోలేదు. గతంలో ఉన్న ప్రభుత్వం రెండు విడతలలో చేసిన మాఫీ ని మీరు ప్రత్యక్షంగా చూడటంతోనే నమ్మలేదన్నారు. అనేక మంది బ్యాంకర్స్ కూడా పలు సందర్భాల్లో గత రెండు పర్యాయాలు అమలు చేసిన తీరుతో రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం చేకూరలేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న రూ.2లక్షల రుణ మాఫీ వంటి బృహత్తర కార్యక్రమంలో రైతులతో పాటు బ్యాంకర్లు కూడా భాగస్వామ్యులే అన్నారు. తమ ప్రభుత్వం ఈ రుణ మాఫీ పథకాన్ని ఆగస్ట్ కల్లా పూర్తి చేయడానికి కట్టుబడి ఉందన్నారు.
అన్న మాట ప్రకారం మొదటి విడతలో కుటుంబానికి లక్ష వరకు ఉన్న పంట రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు అందరికీ తమ ప్రభుత్వం తరఫున ఒకటే విజ్ఞప్తి అన్నారు. రైతు రుణాన్ని రెన్యువల్ చేసుకున్నట్లయితే వారికి నగదు రూపంలో ఖాతాలకు జమచేయబడిన మొత్తాన్ని చెల్లించాలని సూచించారు. ఒకవేళ రైతు పంట రుణాన్ని బాకీ పడ్డట్లైతే వారికి ప్రభుత్వాలు విడుదల చేసిన మొత్తాన్ని రుణం క్రింద జమ చేసుకొని, కొత్త రుణాన్ని వెంటనే మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వం నుండి పంటరుణమాఫీకి చెల్లించే మొత్తం రైతులకు తప్పకుండా చేరే బాధ్యత ప్రతి ఒక్క బ్యాంకు తీసుకోవాలన్నారు. ఆ విధంగా తమ తమ శాఖలన్నింటికి అదేశాలు ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు.