ఇది ఇందిరమ్మ అడ్డా అని.. నీలం మధు ముదిరాజ్ ను గెలిపించాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా మెదక్ స్థానానికి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రిటర్నింగ్ కార్యాలయాల వరకు నిర్వహించిన భారీ ర్యాలీలో సీఎం స్వయంగా పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే రోహిత్ నేతృత్వంలో జరిగిందన్నారు. మెదక్ గడ్డ మీద అసెంబ్లీ ఎన్నికల్లో రోహిత్ ను గెలిపించామన్నారు. బలహీన వర్గాలు బిడ్డను గెలిపించేందుకు తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులను చూస్తే ఉత్సాహంగా ఉందన్నారు. మెదక్ గడ్డ మీద ఇందిరమ్మను గెలిపిస్తే ప్రధాని అయ్యాక పరిశ్రమలు తీసుకువచ్చిందన్నారు. దేశం నలుమూలలా నుంచి కార్మికులు, ఉద్యోగులు వచ్చి ఉపాధి పొందుతున్నారన్నారు.
మెదక్ పార్లమెంట్ 1999 నుంచి నేటి వరకు బీఆర్ఎస్ చేతిలో ఉందన్నారు. ఇందిరమ్మ తెచ్చిన పరిశ్రమలు తప్ప బీజేపీ, బీఆర్ఎస్ లు ఏమీ తేలేరన్నారు. 2014 నుంచి 2024 వరకు బీఆర్ఎస్ పరిశ్రమలు తెచ్చిందా అని అడిగారు. దుబ్బాకను మోడీ ద్వారా ఏమి అభివృద్ధి చేశావో రఘునందన్ రావు చెప్పాలన్నారు. దుబ్బాక లో ఓడిపోయిన రఘునందన్ రావు మెదక్ లో ఎంపీ అవుతారా అని అన్నారు. పద్మశాలీల మీద జీఎస్టీ తెచ్చి చేనేత పరిశ్రమను దెబ్బతీసిండ్రన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లు మెదక్ కు ఎన్ని పరిశ్రమల్ని తెచ్చారు.. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ లు తోడు దొంగలన్నారు. ఇందిరమ్మ మెదక్ పార్లమెంటు సభ్యురాలిగానే నెలకొరిగారన్నారు. మోడీ ప్రధానిగా, కేసీఆర్ సీఎం గా నయా పైసా ఇవ్వలేదన్నారు.
కారు కర్కాణకు పోయింది.. తుక్కుకింద అమ్మాల్సిందే నన్నారు. గజ్వేల్ దగ్గర పాత సమన్లు కొంటా అని తిరుగుతున్నారన్నారు. కాంగ్రెస్ ఖాళీ అయింది అంటున్నాడు.. ఎక్కడ ఖాళీ అయ్యిందో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ను ఖాళీ చేయాలని.. టచ్ చేసి చూడు మాడి మసై పోతావ్ అన్నారు. నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. బట్టలూడదీసి రోడ్డుపై తిప్పుతానన్నారు. మోడీ, కేసీఆర్ ఒక్కటే నన్నారు. అడబిడ్డలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ప్రభుత్వాన్ని పడగొడితే అడబిడ్డలు చూస్తూ ఊరుకోరన్నారు. 10లక్షల రూపాయలు ఆరోగ్య శ్రీ కింద ఇస్తున్నామన్నారు. కోట్లాది మంది పేదలకు వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. మహిళలకు రూ.500 లకే సిలిండర్ ఇస్తున్నామన్నారు.
నరేంద్ర మోడీ, కేసీఆర్ కలిసి 400 ఉన్న సిలిండర్ ను రూ.1200 చేశారన్నారు. కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారు ..అప్రమత్తంగా ఉండాలన్నారు. పార్టీ అనుమతితో 200 యూనిట్లు పేదలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ల ఇచ్చారన్నారు. డబ్బా ఇల్లు వద్దు.. డబుల్ బెడ్రూం ఇల్లు ముద్దు అని కేసీఆర్ అన్నారు.. ఎన్ని ఇచ్చారో చెప్పాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి పేదల ఇళ్ల కోసం 4 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. పంద్రాగస్టు లోపల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. దుర్గమ్మ సాక్షిగా, యేసయ్య ఆశీర్వాదంతో చెబుతున్న.. వచ్చే పంట నుంచి రూ.500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలుచేశామన్నారు. పదేండ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటదన్నారు.
మోడీ పదేండ్లు 20కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారన్నారు. రైతులను చంపిన బీజేపీని బొంద పెట్టాలన్నారు. మోడీ సర్కార్ ను గద్దె దించాలన్నారు. నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో 15లక్షలు వేస్తా అని వేయలేదన్నారు. పేదలకు అండగా నిలిచేది మూడు రంగుల జెండా అన్నారు. ముదిరాజ్ బిడ్డను గెలిపించుకోవాల్సిన బాధ్యత ముదిరాజ్ లదేనన్నారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను ముంచి వేల కోట్లు సంపాదించి నేడు బీఆర్ఎస్ టికెట్ తెచ్చుకున్న వెంకట్రామిరెడ్డి ఏ ఊరు వ్యక్తి అని అన్నారు. కేసీఆర్ కు బువ్వ లేనప్పుడు బువ్వ పెట్టింది మదన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో మోడీని చూశాం.. గల్లీలో కేడీని చూశామన్నారు. 20ఏండ్లు బీఆర్ఎస్, బీజేపీకి వేశారు.. ఇప్పుడు బీసీ బిడ్డకు ఓటేసి నీలం మధును గెలిపించాలన్నారు.