ఇటుక పెళ్ల కదిపిన గాంధీభవన్ కూలుతుంది
మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
ఉమ్మడి వరంగల్, ప్రభ న్యూస్ బ్యూరో : ప్రజాపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతీకార పాలన సాగిస్తోందని మాజీ చీఫ్ విప్, బీఆర్ ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ అన్నారు. గురువారం బాలసముద్రం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ఆరు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టుకుందన్నారు. హామీలు నెరవేర్చుకుంటే నిలదీస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా అవినీతికి పాల్పడుతూ, అసత్య ఆరోపణలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
పార్టీ కార్యకలాపాల కోసం సర్వేనెంబర్ 1066 లో ఒక ఎకర భూమిని ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ రూ.4,84,000 కు కొనుగోలు చేస్తే, వాటిని రద్దు చేయాలని మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ కు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారన్నారు. దీనిపై తాము వివరణ కూడా ఇచ్చామన్నారు. హనుమకొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యాలయానికి కూడా మున్సిపాలిటీ స్థలాన్ని కేటాయించిందని, ఆ పార్టీ వారు ఆంధ్ర బ్యాంకుకు కిరాయి ఇచ్చారని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ… ఒక ఇటుక పెళ్ల కదిపినా గాంధీభవన్ కూలుతుందని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి బోయినపల్లి మెయిన్ రోడ్ లో పది ఎకరాల భూమిని రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు కేటాయించారని గుర్తు చేశారు.