Tuesday, November 19, 2024

TS | వేగంగా పెరుగుతున్న మత్స్య సంపద.. మంచినీటి చేపల ఉత్పత్తిలో మూడోస్థానం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నీలి విప్లవం సాకారం దిశగా తెలంగాణలో మత్స్య సంపద వేగంగా వృద్ధి చెందుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా వరదలు, నీటి వనరుల్లో చేపలు విస్తారంగా లభిస్తున్నాయి. ఏకంగా పొలాల్లోనే భారీ సైజు చేపలు లభ్యమవుతున్నాయంటే తెలంగాణలో మత్స్యసంపద ఏస్థాయిలో వృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలి వర్షాలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా బొమ్మాపూర్‌ గ్రామ రైతు రవీందర్‌రెడ్డికి తన పొలంలోనే ఏకంగా 15కిలోల వాలుగ చేప దొరికింది. వరదకు పొలం గట్లు ఎలా ఉన్నాయో చూద్దామని వెళ్లిన రవీందర్‌కు మడిలో ఏకంగా 15కిలోల చేప తచ్చాతుండడం ఆశ్చర్యానికి గురిచేసింది. తెలంగాణలో మత్స్యసంపద వృద్దికి ఈ ఉదాహరణ చిన్నది మాత్రమే.

చిన్నపాటి వరదకే గతంలో ఎన్నడూ లేనంతగా చేపలు లభ్యమవుతుండడంతో వర్షాలు కురిసి వాగులు, వంకల్లోకి వరద నీరు వస్తోందంటే చాలు… గ్రామస్థులు పనులు వదులుకుని మరీ చేపలు పట్టే కార్యక్రమంలో నిమగ్నమైపోతున్నారు. కొన్ని చోట్ల వరద ఉధృతికి పెద్ద సంఖ్యలో చేపలు ఎదురెక్కుతుండడతో జనం చేతులతోనే కేజీల కొద్దీ చేపలు పట్టుకెళ్తున్న పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. కొన్నిచోట్ల అయితే గ్రామస్థులు చెక్‌డ్యాంలు, కుంటల మత్తళ్లు, రోడ్‌ డ్యాంల వద్ద వరదలో పట్టిన చేపలను ట్రాక్టర్లు, ట్రాలీ ఆటోలు తెచ్చిమరీ వాటిల్లో నింపుకెళ్తున్న దృశ్యాలు తెలంగాణలో తరచూ కనిపిస్తున్నాయి.

- Advertisement -

ఈ పరిస్థితులకు కారణం తెలంగాణ ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమేనని మత్స్యకారులు, గ్రామీణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉచితంగా నీటి వనరుల్లో చేప పిల్లలను వదులుతోంది. రాష్ట్రంలోని 11, 607 మత్స్యసంఘాలకు ఉచితంగా చేప పిల్లలను 2017 నుంచి ఏటా క్రమం తప్పకుండా పంపిణీ చేస్తోంది.

ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.44.6 కోట్ల విలువైన 51.08కోట్ల సంఖ్యలో చేప పిల్లను నీటి వనరుల్లోకి మత్స్యకారుల సాయంతో వదులుతోంది. చేప పిల్లలను వదిలిన 8 నుంచి 10 నెలల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా 2.62లోల టన్నుల చేపల దిగుబడి లభిస్తోంది. ఇప్పటి వరకు ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 415కోట్లను ఖర్చు చేసింది.ఉచిత చేప పిల్లల పంపిణీతో మంచినీటి చేపలను ఉత్పత్తి చేస్తోన్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. ఈ ఏడాది 2022-23లో తెలంగాణలో 6100కోట్ల విలువైన మత్స్యసంపద లభించింది.

భుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేసేనాటికి రాష్ట్రంలో 1000 కోట్ల విలువైన మంచినీటి మత్స్య సంపద కూడా లభించేది కాదు. ఆ పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు లభిస్తున్న రూ.6100 కోట్ల విలువైన మత్స్య సంపద అయిదింతల మేర పెరిగినట్లు స్పష్టమవుతోంది. గడిచిన ఏడేళ్లలో తెలంగాణలో 195శాతం చేపల ఉత్పత్తి పెరిగింది. 2016-17లో మత్స్యాశాఖకు రూ.2252 కోట్ల ఆదాయం సమకూరగా 2022-23లో అది రూ.66656కోట్లకు పెరగడం చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం నీలి విప్లవం సాకారం దిశగా వేగంగా పయనిస్తోన్న విషయం స్పష్టమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement