ఎన్నికల హామీగా 25 వేల టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కేవలం 11 వేల పోస్టులతో చేతులు దులుపుకుందని హరీశ్ రావు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఆరు నెలలు గడుస్తున్నా ఆ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదని, కాంగ్రెస్ పార్టీ అబద్దపు వాగ్దానాలతో విద్యార్థులను మోసం చేసిందని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భర్తీ చేసిన పోస్టులకు నియామక పత్రాలు అందిచి, 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టడమే తప్ప యువతకు, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గ్రూప్స్ విద్యార్థుల అభ్యర్థనలను పరిశీలించాలని.. డీఎస్సీ నోటిఫికేషన్ పోస్టుల పెంపుతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.