Friday, September 20, 2024

ADB: ఆ పెద్దపులి అడుగులు ఇవే.. అతి రహస్యంగా ప్రభ న్యూస్ సేకరణ..

అది మగ పెద్దపులే..
జన్నారం, ఆగస్టు 24(ప్రభ న్యూస్): అభయారణ్యంలో సంచరిస్తున్న పెద్దపులి అడుగులు ఇవే. అతి రహస్యంగా ఆ పెద్దపులి అడుగులను ప్రభన్యూస్ సేకరించింది. వచ్చిన పెద్దపులి అడవుల్లో విస్తృతంగా తిరుగుతున్నట్లు ప్రచారం. ఆ పెద్దపులికి ఆహార జంతువులు ఎక్కువ ఉన్నందున ఇక్కడే మఖాం వేసి ఉన్నట్లు తెలిసింది. ఆ పులి ఇక్కడే ఉండాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జన్నారం డివిజన్ కవ్వాల పులుల అభయారణ్యంలో పెద్దపులి విస్తృతంగా తిరుగుతుంది. ఈ మేరకు మంచిర్యాల డీఎఫ్ఓ శివ ఆశిష్ సింగ్, తాళ్లపేట రేంజ్ ఆఫీసర్ సుష్మారావు, ఇతర అధికారుల ఆధ్వర్యంలో అటవీ శాఖ అనిమల్ ట్రాకర్స్ ఈనెల 22న ఆ పెద్దపులి అడుగులను గుర్తించారు.

ఆపులి మగ పెద్దపులి అని, సుమారు మూడున్నర ఏండ్ల వయస్సు గలదిగా భావిస్తున్నారు. అడుగులను బయట పెట్టడం లేదు. అయినప్పటికీ ప్రభ న్యూస్ అతిరహ‌స్యంగా ఆ పెద్దపులి అడుగులను సేకరించింది. పెద్దపులి అభయారణ్యం అడవుల్లో సంచరిస్తుందని అధికారులందరూ అడవులకు సమీపాన ఉన్న గ్రామాల్లో దండోరా వేయించి, అడవులకు ప్రజలు, పశువుల కాపర్లు, ఎవరు కూడా వెళ్లకూడదని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

వారం రోజుల క్రితం కొమరం కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని, గుండాల అడవుల్లో తిరిగిన పెద్దపులి ఈ పులి ఒక్కటేనని అడుగులను బట్టి అటవీ అధికారులు ధ్రువీకరించారు. ఈ విషయమై శనివారం సాయంత్రం ఓ అటవీ అధికారిని సంప్రదించగా, పెద్దపులి అడుగులను తమ అనిమల్ ట్రాకర్స్ గుర్తించారన్నారు. నిర్దిష్టమైన ప్రదేశాన్ని తెలుపకూడదని నిబంధనలు ఉన్నట్లు చెప్పారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి కాగజ్ నగర్ కారిడార్ ద్వారా కొమురం భీం ఆసిఫాబాద్ అడవుల గుండా కవ్వాల అడవుల్లోకి పెద్దపులి వచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement