Friday, November 22, 2024

రాగల మూడు రోజులు భారీ వర్షాలే.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హెదరాబాద్‌, ఆంధ్రప్రభ: రెండు రోజులుగా వర్షాలతో తడిసి ముద్దవుతున్న రాష్ట్రాన్ని మరో మూడు రోజులు ఎడతెరిపిలేని వర్షాలు ముంచెత్తనున్నాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాల తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు భారీనుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

శుక్రవారం ఉత్తర ఆంధ్ర ప్రదేశ్‌ దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరల్లోని పశ్చిమ తీరం ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం శనివారానికి తీవ్ర రూపం దాల్చింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి మధ్య ట్రోపోస్పిరిక్‌ స్థాయిల వరకు విస్తరించి ఉందని, ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలకు దగ్గరలోని వాయువ్య దిశలో పయణించి పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తద్వారా రెండు రోజులపాటు భారీనుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. ఈ ఈదురు గాలులు గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి.

శనివారంనాడు సాయంత్రానికి సగటు సముద్ర మట్టం వద్ద ద్రోణి ఓఖ , అకోలా , జగ్ధల్‌ పూర్‌ గుండా, తూర్పు ఆగ్నేయ దిశగా వెళుతూ ఉత్తర ఆంధ్ర ప్రదేశ్‌ దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గర లోని పశ్చిమ తీరానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడన ప్రాంతం మీదుగా వెళుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాగల మూడు రోజులపాటు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement