భారత ఎన్నికల విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు, సుందర కట్టడాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అన్నారు.
ఈ సందర్భంగా భారత ఎన్నికల ప్రక్రియ అంశంపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు వినోద్ కుమార్ సమాధానాలు ఇచ్చారు. భవిష్యత్ తరాలకు మెరుగైన ఎన్నికల వ్యవస్థను అందించేందుకు భారత ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉందని బోయినపల్లి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. కేవలం 32 శాతం ఓట్లు సాధించి బీజేపీ తరపున నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. 60 శాతానికి పైగా ప్రజలు బీజేపీని తిరస్కరించినా… కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
రాజకీయ పార్టీలకు పోలైన ఓట్లను బట్టి ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే స్థితికి భారతదేశం చేరుకోవాలని, ఈ విషయంలో దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరగాలని, మేధావులు ఆలోచించాలని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో భాగంగా రాష్ట్రంలోని దేవాలయాలను కూడా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వినోద్ అన్నారు. ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి త్వరలో సమీక్షిస్తారని.. ‘దక్షిణ కాశీ’గా పేరొందిన వేములవాడ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.