కుత్బుల్లాపూర్, (ప్రభన్యూస్): రైతుల మీద ఎనలేని ప్రేమను ఒలకబోస్తూ, ఒకవైపు బూటకపు వాగ్దానాలు చేస్తూనే, మరోవైపు ఉచిత విద్యుత్ వద్దని చెబుతున్న కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీరుపై మండిపడ్డారు కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద. ప్రజలు, రైతులు రేవంత్‌రెడ్డి తీరును గమనిస్తున్నారని, తగిన సమయంలో తగినట్టు బుద్ధి చెబుతారని అన్నారు. ఇవ్వాల (సోమవారం) మీడియాతో మాట్లాడిన వివేకా పలు అంశాలను లేవనెత్తారు.
కాంగ్రెస్ పార్టీలో నియంతలా మారిన రేవంత్ రెడ్డి.. తెలంగాణ రైతు వ్యతిరేక విధానాలను ప్రజలంతా నిశితంగా గమనిస్తున్నారన్నారు. వారి తీరును ఖండిస్తూ , కాంగ్రెస్ పార్టీ విధానాలను ఎండగట్టాలన్నారు.
రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీది రైతు విధ్వంస ఆలోచనలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రైతుల తెరువుకు వచ్చే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలను కోరారు.
రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న రైతు సంక్షేమ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే వివేకా ఈ సందర్బంగా గుర్తు చేశారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీది అన్నదాతల సంక్షేమ పాలన అని.. దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా కేసీఆర్ వంటి రైతు సంక్షేమ పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాగ్దానాలను దమ్ముంటే వారు పాలిస్తున్న రాష్ట్రాలలో ముందుగా అమలు చేసి చూపించాలని సవాల్ చేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను ఏనాడు ఈ వ్యతిరేకించని రేవంత్‌రెడ్డి కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నారనే విషయం అర్ధం చేసుకోలేనంత స్థితిలో ప్రజలు లెరని వివేకానంద అన్నారు. అన్నదాతల జోలికొస్తే ఆగం కాకతప్పదని నిరూపిద్దామని ఈ సందర్బంగా రైతులను కోరారు.