హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లిహిల్స్ బాలిక అత్యాచార ఘటన కేసు విచారణను తక్షణమే సీబీఐకి అప్పగించాలని పౌర సమాజం తరుపున రాష్ట్ర ప్రభుత్వాన్ని పలువురు డిమాండ్ చేశారు. సామాజిక కార్యకర్తలు జయ వింధ్యాల, హరీత్‌రూఢ, దామోదర్‌రెడ్డి, ఇక్బాల్‌ఖాన్, బాలకిషన్‌రావు, ముత్యాల వెంకటేష్ గుణ, తిరుమల్, సలీం తదితరులు సోమవారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. జూబ్లిహిల్స్ అత్యాచార కేసులో రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నందున స్థానిక పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ కొనసాగించలేరని స్పష్టం చేశారు.
రొమేనియా బాలికకు న్యాయం జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం లాభాపేక్షతో పనిచేయకూడదని, ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయాలని సూచించారు. దిశ అత్యాచార నిందితులను కాల్చి చంపడం, పలు కేసుల్లో అనుమానితులను స్థానిక పోలీసులు హింసించారని గుర్తు చేశారు.
జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు నుంచి మహ్మద్‌ఫుర్‌ఖాన్ అహ్మద్‌ను తప్పించే ప్రణాళికను అమలు చేశాకే తెలంగాణ పోలీసులు మీడియా ముందుకు వచ్చారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో సీబీఐకి ఈ కేసును అప్పగిస్తేనే బాధిత బాలికకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.