Friday, November 22, 2024

KNR: జిల్లాలో విత్తనాల కొరత లేదు.. కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌

అందుబాటులో రైతులకు సరిపడా నిల్వలు
తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు..
నకిలీ విత్త‌నాలు అమ్మితే కఠినచర్యలు
ఆధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనాలి..
విత్తనాల సరఫరాపై నిరంతరం నిఘా
జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌, సీపీ శ్రీనివాస్‌

పెద్దపల్లి రూరల్‌, జూన్‌ 1 (ప్రభ న్యూస్‌): సోషల్‌ మీడియాతో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మి రైతులు మోసపోవద్దని, రైతులకు సరిపడా విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ తెలిపారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం రామగుండం సీపీ శ్రీనివాస్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ మాట్లాడుతూ… జిల్లాలో విత్తనాల కొరత లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 353 మంది విత్తన డీలర్లు 400 వరకు దుకాణాల ద్వారా విత్తనాలను విక్రయిస్తున్నారని తెలిపారు. జిల్లాలో లక్షా 55 వేల మంది రైతులు 2లక్షల 80వేల ఎకరాలలో వానాకాలంలో పంటలు సాగు చేయనున్నారని, సాగుకు అవసరమైన విత్తనాల కంటే 50శాతం అదనంగా నిల్వలను ఉంచామన్నారు.

రైతులు సాగుకు ముందే పచ్చిరొట్టతో భూసారాన్ని పెంచుకోవాలని, అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సన్నరకం వరి విత్తనాలు బీపీటీ, కేఎన్‌ఎం, ఎంటీయు రకాలు ఉన్నాయన్నారు. 134 రకాల పత్తి వెరైటీలలో 20రకాల వెరైటీలనే రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో హెచ్‌టీ, బీటీ- 3 వెరైటీ విత్తనాలను నిషేధించినట్లు, అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులు ఆధీకృత డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని తెలిపారు. కల్తీ విత్తనాలను నిరోధించేందుకు టాస్క్‌ ఫోర్స్‌ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. దుకాణం దారులు విత్తనాలు, ఎరువుల నిల్వల వివరాలను తెలుపుతూ బోర్డుపై ప్రదర్శించాలని సూచించారు.

జిల్లాలో విత్తనాల సమస్యలపై కాల్‌ సెంటర్లు నెం. 9573951060 ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. సోషల్‌ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కోరారు. రామగుండం సీపీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ… ఇటీవల కాలంలో సోషల్‌ మీడియాలో విత్తనాల కొరతపై తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని, వాటిని రైతులు నమ్మవద్దని కోరారు. నకిలీ విత్తనాలు అమ్మకుండా నిరంతరం నిఘా పెట్టినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలు, పాత విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి ఉన్న కంపెనీల విత్తనాలను మాత్రమే అమ్మాలని, కల్తీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా టాస్క్‌ఫోర్స్‌ బృందాలచే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు అసత్య ప్రచారాలను నమ్మకుండా అనుమతి ఉన్న కంపెనీల రకాల విత్తనాలను కొనుగోలు చేసి రశీదులు పొందాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement