Saturday, November 23, 2024

బొగ్గు నిల్వలకు డోకా లేదు, విద్యుత్ స‌ప్ల‌య్‌కి ఆటంకం ఉండదు : జగదీష్‌రెడ్డి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వంద ఏళ్లలో ఎన్నడు పడనంత వర్షపాతం నమోదయినప్పటికి కనురెప్పపాటు అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా జరుగుతోందని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని .. తక్షణమే చర్యలు చేపట్టి విద్యుత్‌ను వినియోగదారులకు అందిస్తున్నామని ఆయన వివరించారు. ఆ ఘనత తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలకే దక్కిందని మంత్రి అభినందించారు. ఇవే వర్షాలు ఉమ్మడి రాష్ట్రంలో పడినప్పుడు విద్యుత్‌ శాఖ అతలాకుతలమైన సందర్భాలున్నాయని, కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి విరించారు.

రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో విద్యుత్‌ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మంత్రి జగదీష్‌రెడ్డి విద్యుత్‌ సౌదలో బుధవారం సమీక్ష నిర్వహించగా.. ట్రాన్స్‌,జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ప్రభాకర్‌రావు, జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్‌ శాఖ సిబ్బంది సరిహద్దులోని సైనికుల్లా పని చేస్తున్నారని, అందుకు సిబ్బందితో సీఎండీలు సమన్వం చేసుకోవడం వల్లే సాధ్యమవుతోందన్నారు. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాల వల్ల, విద్యుత్‌ సమస్యలు రావడం లేదని మంత్రి వివరించారు. అందులో భాగంగానే ముందస్తు బందోబస్తుగా ఏర్పాటు చేసుకున్న బొగ్గు నిల్వలే నిదర్శనమన్నారు.

నెల రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. ముందెన్నడు లేని విధంగా వర్షాలు, వరదలు సంభవించినప్పటికీ ట్రాన్స్‌ మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ సమర్థవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ విద్యుత్‌ సంస్థల కృషి అభినందనీయమన్నారు. సింగరేణి ఓపెన్‌కాస్టులో నీరు చేరడం, ట్రాన్స్‌పోర్ట్‌ తదితర సమస్యలతో ఉత్పత్తి తగ్గినప్పటికీ జెన్‌కోకు సరఫరా చేస్తున్న బొగ్గు విషయంలో సమస్యలు ఉత్పన్నం కావడం లేదన్నారు. విద్యుత్‌ సరఫరా అన్నది డైనమిక్‌ సిస్టమని, ఆటుపోట్లును అధిగమిస్తూ గ్రిడ్‌ దెబ్బతినకుండా పని చేయడం రాష్ట్ర విద్యుత్‌ సంస్థల పనితీరుకు నిదర్శనమన్నారు.

అధికంగా కురుస్తున్న వర్షాల వల్ల 2,300 స్తంభాలు నెలకొరిగాయని, వాటిలో ఇప్పటికే 1800లకు పైగా పునరుద్ధరించామన్నారు. ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో ఇప్పటికీ భారీ వర్షాలు నమోదవుతున్నాయన్నారు. భూపాలపల్లి నియోజక వర్గ పరిధిలోని సర్వాయిపేట సబ్‌స్టేషన్‌ 33/11కేవీ సరఫరా ఆగిందన్నారు. రెండు, మూడు రోజుల్లో దానిని పునరుద్ధరించి సరఫరా కొనసాగిస్తామని మంత్రి జగదీష్‌రెడ్డి వివరించారు. విద్యుత్‌ ప్రసారాల విషయంలో ప్రజల్లో అప్రమత్తత అవసరమని మంత్రి తెలిపారు. నిమ్ముతో తడిసిన గోడలు, ట్రాన్స్‌ఫార్మర్స్‌, విద్యుత్‌ స్తంభాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement