- మా పార్టీ కార్యాలయాలు, ఇళ్లపైకి వచ్చినా భయపడం
- 60లక్షల మంది సైనికులున్న కుటుంబం బీఆర్ఎస్
- వారు తలచుకుంటే కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదు
- ఖబద్దార్ కాంగ్రెస్ నాయకులు
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
యాదాద్రి భువనగిరి, ఆంధ్రప్రభ ప్రతినిధి : తమ పార్టీ కార్యాలయాలు, ఇళ్లపైకి వచ్చినా భయపడమని, 60లక్షల మంది సైనికులున్న కుటుంబం బీఆర్ఎస్ అని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు… జాగ్రత్తగా ఉండండి అంటూ ఆమె హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ కార్యాలయం వైపు కన్నెత్తి చూసినా పార్టీ కార్యకర్తలు ఊరుకోరని హెచ్చరించారు. రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి తమది కాదని, మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి తమదన్నారు.
మూసీ కలుషితానికి కారకులెవరో ప్రజలు గుర్తించాలి…
మూసీ మురికిమయం కావడానికి కారకులు ఎవరో ప్రజలు గుర్తించాలని, పారిశ్రామిక వ్యర్ధాలు మూసీలో కలుస్తుంటే 60ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది ? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మూసీ నదిని ప్రక్షాళించడానికి మాజీ సీఎం కేసీఆర్ సంకల్పించారని గుర్తు చేశారు. అందులో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలనుకున్నారన్నారు. మూసీలో మురుగునీటి శుద్ధి కోసం 31 ఎస్టీపీలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మూసీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారన్నారు. దీనిని కాంగ్రెస్ నాయకులు ఏటీఎం గా తయారు చేసుకోవాలని చూస్తున్నారని చెప్పారు.
మల్లన్న సాగర్ నుంచి అనుసంధానం చేస్తామనడం సరికాదు..
హైదరాబాద్ కు దగ్గరలో ఉన్న కొండపోచమ్మ సాగర్ ను వదిలేసి, దూరంగా ఉన్న మల్లన్న సాగర్ నుంచి మూసీ- గోదావరి అనుసంధానం చేస్తామని ప్రభుత్వం అనడం సరికాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఈ ప్రాజెక్టు చేపడుతున్నారని, అందుకే అనుసంధాన ప్రాజెక్టు వేయండి రూ 7500 కోట్లకు పెంచారన్నారు. రూ. 7500 కోట్ల ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చెప్పారు. కొండపోచమ్మ నుంచి మూసీ అన్నసంధానం చేసే ఆస్కారం ఉన్నప్పుడు ఈ కొత్త ప్రాజెక్టు ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి నల్లగొండ జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
పేదల ఇళ్లపై బుల్డోజర్లు…
మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చివేత కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతోందని, పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పంపిస్తోందని కవిత అన్నారు. మూసీ ప్రక్షాళనకయ్యే వ్యయం రూ.50 వేల కోట్లు అని ఒకసారి, లక్ష కోట్లు అని మరొకసారి, లక్షన్నర కోట్లు అని ఇంకోసారి సీఎం చెబుతున్నారన్నారు. మూసీని ఏటీఎంగా మార్చుకొని, వచ్చే డబ్బును ఢిల్లీకి పంపించే ప్రణాళిక సీఎం రేవంత్ రెడ్డి వేసుకున్నారని ఆరోపించారు. యాదాద్రిలో కేసీఆర్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలన్నారు.
యాదాద్రి వైభవాన్ని కాపాడాలి..
యాదాద్రి వైభవాన్ని ప్రభుత్వం కాపాడాలని కవిత కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని పారద్రోలడానికి కేసీఆర్ సంకల్పించారన్నారు. అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేశారన్నారు. ఫ్లోరైడ్ ని నిర్మూలించిన ఘనత కేసీఆర్ దని అన్నారు. అనేక ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన పోలేదని చెప్పారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి వారిని దర్శించుకున్న కవిత…
యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వామి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదర్శనలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.. స్వయాన లక్ష్మీనరసింహస్వామి కేసీఆర్ కు శక్తిని అందించి ఆలయ నిర్మాణానికి పూనుకునేలా కృప కల్పించారు. ఏళ్ల తరబడి నిలబడేలా, తెలంగాణ ప్రజల కొంగుబంగారంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కేసీఆర్ మహాద్భుతంగా నిర్మించారన్నారు. రూ.1200 కోట్లతో ఆలయాన్ని సుందరంగా నిర్మించారు.. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన చిన్న చిన్న పనులను కూడా పూర్తి చేయాలని కోరుతున్నాం.. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా గుడిని అభివృద్ధి చేయాలి.. భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి..ప్రతినెలా ఒకరోజు ఎంతో మహోత్సవంగా నిర్వహిస్తున్న గిరి ప్రదక్షణలో భక్తులు పాల్గొనాలన్నారు.