కెసిఆర్ కుటుంబానికి అండగా కాంగ్రెస్ మంత్రి
ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కదారి పట్టించేది ఆ మంత్రే
కెసిఆర్, కెటిఆర్ తో ఆ మంత్రి మిలాఖత్
కెసిఆర్ అరెస్ట్ కాకుండా అడ్డుపడుతున్నది అతనే
బిజెపి ఎంపి బండి సంజయ్ సంచలన ఆరోపణలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ మాదిరిగానే రేవంత్ పాలన సాగుతోందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై ట్యాపింగ్ కేసును నీరుగార్చారన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రజలను మోసగించిందని ఆరోపించారు.
ఎన్నికల వేళ రిజర్వేషన్లను అడ్డుపెట్టుకుని సీఎం రేవంత్‌రెడ్డి కొత్త నాటకానికి తెర లేపారని ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలింగించేలా గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని ఫైర్ అయ్యారు. ఇప్పటికే ఆ కేసులో కొంతమంది పోలీసులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని గుర్తు చేశారు. అంత పెద్ద కేసు ప్రస్తుతం చర్చలో లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును నీరు గార్చేందుకు, కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ మంత్రి ప్రయత్నిస్తున్నాడంటూ ఆరోపించారు. అదే మంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో లాలూచి పడి, చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కదోవ పట్టించారన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా ఫోన్ ట్యాపింగ్‌కు బాధితుడేనని, అందుకే ఆయనకు ఏడాది పాటు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ స్టేట్‌మెంట్‌లో కూడా కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేశానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారని పేర్కొన్నారు. అయినా..ఈ కేసులో ప్రభుత్వం మిన్నకుండిపోవడం ఆశ్చర్యంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోస్తీకి నిదర్శనం కాదా.. అని బండి సంజయ్ ప్రశ్నించారు..
వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారని చెప్పారు. తమ మేనిఫెస్టో ఖురాన్, బైబిల్, భగవద్గీత అని కాంగ్రెస్ నేతలు చెప్పారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం, పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయని కాంగ్రెస్ నేతలు చెప్పే మాటలను ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. భారత రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటమి ఖాయమైందని బండి సంజయ్ స్పష్టం చేశారు.