వరంగల్ క్రైమ్, జులై 29 (ప్రభ న్యూస్) : వరంగల్ నగర నడిబొడ్డున గల భద్రకాళి చెరువుకు గండి పడడం వల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరమేమి లేదని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. గండి పడిన ప్రాంతాన్ని జిల్లా అధికార యంత్రాంగంతో పాటు వరంగల్ పోలీస్ కమిషనర్ పరిశీలించారు. సిపి రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ… భద్రకాళీ చెరువుకు గండి పడిందని ప్రజలు కలవరపడాల్సిన అవసరమేమి లేదన్నారు. చెరువు దిగువ ప్రాంతాలకు కూడా ప్రమాదేమేమి ఉండదన్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే సమీప కాలనీలను ప్రజలను ఖాళీ చేయిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు చెప్పారు.
చెరువుకు పడ్డ గండి కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరుగకుండా అన్నీ పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వరద ఉధృతి తగ్గించేందుకు ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న నీటిని దారి మళ్లించే చర్యలతో పాటు నిలిపి వేయించే చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ సీపీ వివరించారు. ఇప్పటికైతే ప్రమాదేమమి లేదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ చెరువు పరిసర ప్రాంతాల్లో పోలీసుల పర్యవేక్షణ జరుపుతున్నారని, డ్రోన్ ల ద్వారా కలెక్టర్ కూడా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు.