ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో ఢిల్లీలో భేటీ
పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
రేవంత్ కు సంపూర్ణ సహకారం ఇస్తానన్న మహేష్
న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ ఖాతాలోనే చేరుతాయని ఆయన తేల్చిచెప్పారు. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను మహేష్ కుమార్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 60 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న మహానాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని.. ఖర్గేను కలిసి ఆశీస్సులు తీసుకున్నానన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ బలోపేతానికి పనిచేయాలని ఖర్గే సూచన చేశారన్నారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీకి మరిన్ని ఎక్కువ సీట్లు వచ్చేలా పనిచేస్తామన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తామని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి, పార్టీ పెద్దల చేతిలో ఉంటుందని అన్నారు.
పీసీసీ అధ్యక్షుడు మారిన ప్రతిసారి కొత్త కమిటీలు ఏర్పడతాయని అన్న మహేష్ కుమార్ కొత్త కమిటీల విషయంలో ఏఐసిసి పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.. పార్టీ ఫిరాయించిన అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూనే.. న్యాయ ప్రత్యామ్నాయాలు చూస్తామన్నారు. రాజ్యాంగబద్ధంగా పార్టీ మార్పులపై నడచుకుంటామని చెప్పారు.