కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలించేందుకు బయల్దేరిన బీఆర్‌ఎస్ నేతల బృందం కరీంనగర్ లోయర్ మానేరు డ్యామ్‌ను పరిశీలించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవల్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాయంతో పంజాబ్‌ను తలదన్నేలా తెలంగాణ ధాన్యం పండించిందని గుర్తుచేశారు. ప్రతినీటి బొట్టును ఒడిసిపెట్టాలన్న సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని తెలిపారు.
అయితే, కాళేశ్వరం ప్రాజెక్టును వృథా ప్రయత్నంగా చూపించే కుట్ర జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు ఎనిమిది నెలలుగా ప్రయత్నం జరుగుతుందని మండిపడ్డారు. రాజకీయ కక్షలు పెట్టుకుని రైతులను ఆగం చేయవద్దని సూచించారు. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.
ఈ ఏడాది 45 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారని అన్నారు. కాబట్టి నీళ్లు వృథా పోకుండా వెంటనే రిజర్వాయర్లను నింపాలని సూచించారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందకు వృథాగా పోతుందని ఇంజనీర్లు చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం రిజర్వాయర్‌లో 240 టీఎంసీల నీళ్లను నింపుకోవచ్చని తెలిపారు. అంటే 24 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.