Saturday, November 23, 2024

TS | రాష్ట్రంలో కరెంట్ కోతలు లేనే లేవు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రాష్ట్రంలో కరెంట్ కోతలు లేనే లేవని, పీక్ డిమాండ్ లో కూడా నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తుండగా బిఆర్ఎస్ నేతలు రాజకీయ పబ్బం గడుపు కోవడానికి అసత్య ప్రచారం చేయడాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు తప్పుపట్టారు..

కాంగ్రెస్ వస్తే కరెంటు పోతదని అసెంబ్లీ ఎన్నికల ముందు బి ఆర్ ఎస్ నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టి ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. తెలంగాణ ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు మాత్రం ఇంకా బుద్ధి రాలేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్దికోసం బిఆర్ఎస్ నాయకులు ఎక్కడ పడితే అక్కడ వాళ్ల మీటింగ్లు, ప్రెస్మీట్లలో కరెంట్ కట్ అయినట్లు.. వాళ్లకు వాళ్లే నాటకాలు సృష్టిస్తున్నారని తెలిపారు.

సూర్యాపేటలో, మొన్న మహబూబ్నగర్ కేసీఆర్ ఉన్నప్పుడే కరెంటు పోయిందని సోషల్ మీడియాలో లేని పోని అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చినప్పటి నుంచి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ కరెంట్ కోతలు లేవన్నారు.

ఎక్కడైనా సాంకేతిక కారణాలతో అంతరాయం తలెత్తినా.. వెంటనే విద్యుత్తు సిబ్బంది అక్కడ విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. ఎక్కడైనా విద్యుత్తు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే వాటిని కూడా ఉపేక్షించటం లేదన్నారు. వెంటనే వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సిబ్బందిపై చర్యలు తీసుకుంటే కూడా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తూ తప్పు పట్టడం దురదృష్టకరమన్నారు.

విద్యుత్తు పేరు మీద రాజకీయ పబ్బం గడుపుకోవాలనే ఆరాటం తప్పా, ప్రజలకు 24 గంటల విద్యుత్తు సరఫరా చేయాలనే ఇష్టం లేనట్టుగా కనిపిస్తుంది అన్నారు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రమంతటా అయిదు నెలల్లో చేసిన విద్యుత్తు సరఫరా, గత ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే ఎక్కువ విద్యుత్తును సరఫరా చేశామని వివరించారు. 2022 డిసెంబర్ నుంచి 2023 ఏప్రిల్ వరకు మొత్తం 36,207 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా జరుగగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ 30 వరకు 38, 155 మిలియన్ యూనిట్ల విద్యుత్తు సరఫరా చేశామని తెలిపారు. ఒకే రోజున గరిష్టంగా 15,497 మెగావాట్ల పీక్ డిమాండ్ విద్యుత్త్ సరఫరా చేసిన చరిత్ర తమ ప్రభుత్వాన్నిదని వెల్లడించారు. వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేయడంతో విద్యుత్తు డిమాండ్ సహజంగానే పెరిగిపోతుంద న్నారు. అక్కడక్కడ లోడ్ పెరిగితే ఒక్కోసారి ట్రిప్పు అవటం, సాంకేతిక అవాంతరాలు తలెత్తుతాయన్నారు. వాటిని ఎప్పటికప్పుడు మా విద్యుత్తు సిబ్బంది సమర్ధవంతంగా అధిగమిస్తూ ప్రజలకు అసౌకర్యం లేకుండా సత్వర సేవలు అందిస్తున్నారని తెలిపారు.

- Advertisement -

ఇంతకంటే ఏం ఆధారం కావాలి..?

“గత ఏడాది సరిగ్గా ఇదే టైమ్ లో అంటే ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు వారం రోజులు మండు టెండలున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో 1369 సార్లు 11 కేవీ లైన్ ట్రిప్పింగ్లు అయ్యాయి. మొత్తం ఆ వారం రోజుల్లో 580 గంటలు విద్యుత్తుకు అంతరాయం వాటిల్లింది. ఇప్పుడు అదే గడిచిన వారంలో కేవలం 272 చోట్ల 11 కేవీ విద్యుత్తు సరఫరా ట్రిప్పు అయింది.

కేవలం 89 గంటలు మాత్రమే అంతరాయం వాటిల్లింది అని” తెలిపారు. “గత ఏడాది అదే వారంలో లెక్కలు చూసుకుంటే అప్పుడు 301 ట్రాన్స్ ఫార్మర్లు ఫెయిలయ్యాయి. ఇప్పుడు కేవలం 193 ట్రాన్స్ ఫార్మర్లు ఫెయిలయ్యాయి. వాటిని కూడా వెంటనే మార్చి కొత్తవి బిగించి విద్యుత్తు పునరుద్ధరించాం. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రభుత్వం మెరుగైన విద్యుత్తును సరఫరా చేస్తుందని ఇంతకంటే ఏం ఆధారం కావాలి.? అప్పుడు కరెంట్ కోత లేనేలేదని మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు వీటికేం సమాధానం చెపుతారని” ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిలదీశారు.

జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ విద్యుత్తు అంతరాయానికి సంబంధించిన ఫిర్యాదు వచ్చినా వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా 226 స్పెషల్ వ్యూ ఆఫ్ కాల్ టీమ్ లను ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ లో ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి విద్యుత్తు సరఫరాను నిరంతరం పర్యవేక్షించటం జరుగుతోందన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా పరిష్కరించేందుకు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్విరామంగా పని చేస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement