రేవంత్, పొంగులేటి, కేవీపీ, పట్నం, గుత్తా,
లతో పలువురు కాంగ్రెస్ నేతలకే ఫామ్ హౌజ్ లు
ముందు వాటి సంగతి చూడండి
రుణమాఫీ గోరంత చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారు
రైతులకు న్యాయ చేసేందుకు రేపటి నుంచి ధర్నాలు
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : నాకు ఫామ్ హౌజ్ లు లేవని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తన పేరుతో ఎలాంటి ఫామ్ హౌజ్ లేదని.. తెలిసిన మిత్రుడిది లీజుకు తీసుకున్నానని క్లారిటీ ఇచ్చారు. అది ఒకవేళ బఫర్ జోన్‌లో ఉంటే తానే దగ్గరుండి కూలగొట్టిస్తానని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేవంత్‌రెడ్డి ఫామ్ హౌజ్ ఎక్కడుందో తాను చూపిస్తానన్నారు. పొంగులేటి, కేవీపీ, పట్నం మహేందర్‌రెడ్డి.. గుత్తా, రేవంత్‌రెడ్డికి ఫామ్‌హౌస్‌లు ఉన్నాయన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌజ్ ఎఫ్‌టీఎల్ లిమిట్స్‌లో ఉందని, ఇప్పటికే ఆయన సోదరుడు అక్కడే ఉంటున్నారని గుర్తు చేశారు.
రవ్వంత చేసి.. కొండంత డబ్బా..
రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగలేదని, అందుకు మంత్రుల మాటలే సాక్ష్యమన్నారు. రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులకు టోపీ పెట్టారన్నారు. రుణమాఫీ పచ్చి బూటకమనేది అర్థమవుతోందంటూ రవ్వంత చేసి కొండంత డబ్బా కొట్టుకుంటున్నారని మండిపడ్డారు. రుణమాఫీ విషయంలో వాళ్లలో వాళ్లకే సమన్వయం లేనట్లుందన్నారు. అందుకే ముఖ్యమంత్రి, మంత్రులు తలోమాట చెబుతున్నారని వివరించారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందన్నారు.. రుణమాఫీతో మరోసారి అబద్ధాల ముఖ్యమంత్రి నిజస్వరూపం బయటపడిందన్నారు కేటీఆర్.
తమ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితే కాదు.. భారత రైతు సమితి కూడా అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం స్పందించి ఎప్పటిలోగా ప్రక్రియను పూర్తి చేస్తారో చెప్పాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పూర్తిగా రుణమాఫీ కాలేదని ఆరోపించారు. కోస్గి ఉమ్మడి మండలంలో 20,239 రైతు ఖాతాలున్నాయని, అందులో కేవలం 8,527 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని జాబితాను కేటీఆర్ చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ జరగకపోవడంతో తెలంగాణ రైతాంగం రగిలిపోతోందన్నారు. మోసం చేసిన రేవంత్ తక్షణం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రైతులకు న్యాయం చేసేందుకు రేపు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేపడతామని కేటీఆర్ అన్నారు.
తెలుగుతల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు చేస్తాం..
రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభలో సీఎం రేవంత్ బజారు భాష మాట్లాడారని.. అందుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు చేస్తామన్నారు.. రుణమాఫీ ఆందోళనలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, బజారు భాష, చిల్లర భాషతో తాము పక్కదారి పట్టబోమని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR Comments On His Farm House | Andhraprabha