నెన్నెల: ఓ ఆగంతకుడు ఆశగా అర్ధరాత్రి బ్యాంకులో చొరబడ్డాడు. ఆబగా నగదు కోసం వెతికాడు. క్యాష్‌కౌంటరేమో ఖాళీగా కనిపించింది. స్ట్రాంగ్‌రూం తాళం యమా స్ట్రాంగ్‌గా ఉండటంతో తెరుచుకోలేదు. ఎక్కడ వెతికినా ఏమీ దొరకలేదు. ఆనక చేసేదేమీలేక ‘గుడ్ బ్యాంక్.. ఒక్క రూపాయి కూడా దొరకలేదు’అని కితాబు ఇస్తూ ఓ పేపర్‌పై రాసి వెళ్లిపోయాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో చోటు చేసుకుంది.
ముసుగు వేసుకుని అర్ధరాత్రి దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు బ్యాంకు తలుపు తాళం పగలగొట్టి లోనికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్‌లో చిల్లిగవ్వ కూడా లభించలేదు. ఎంత ప్రయత్నించినా స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరుచుకోలేదు. ఇలా 15 నిమిషాలు బ్యాంకులో ఉండి చోరీకి యత్నించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పోతుపోతూ టేబుల్‌పై ఉన్న ఓ పేపర్ మీద ‘గుడ్ బ్యాంకు, రూపాయి కూడా దొరకలేదు. నన్ను పట్టుకోవద్దు. నా ఫింగర్‌ప్రింట్ కూడా దొరకదు’అని మార్కర్‌తో రాశాడు.
ఉదయం బ్యాంకు ఆవరణలో ఊడ్చేందుకు వచ్చిన స్వీపర్ రాములు బ్యాంక్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి మేనేజర్ వెంకటేశ్వర్‌రెడ్డికి సమాచారం ఇచ్చాడు. మేనేజర్ వెంటనే బ్యాంకుకు చేరుకుని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు నగదు చోరీ కాకపోవడంతో సిబ్బంది, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెల్లంపల్లి ఏసీపీ సదయ్య బ్యాంక్‌ను సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.