ముధోల్, (ఆంధ్రప్రభ): దొంగలకు దొంగతనాలు చేయడం, చాలా తెలికైపోయింది. అలా వచ్చి, ఇలా పని కానించి వెళ్లిపోతున్నారు. పగటి పూట దొంగతనాలకే దొంగలు మొగ్గు చూపుతున్నట్టు నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని సాయి మాధవ్ నగర్ లో జరిగిన ఘటనే అందుకు నిదర్శనం.
కాలనీ కి చెందిన డికొండవార్ సాయినాథ్ ఒక దర్జీ షాపుకి, భార్య అంగన్వాడీ టీచర్ పనికి వెళ్లారు. వారు మంగళవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న డబ్బు, బంగారు, వెండి నగలు గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. దీంతో జరిగిన ఘటనపై ముధోల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై కె. సంజీవ్ కుమార్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం 4 తులాల బంగారం,50 తులాల వెండి తో పాటు, రూ. 40 వేల నగదు చోరీ అయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని, దీనిపై కేసు నమోదు చేసుకుని, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.