మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు సింగరేణి మహిళా కార్మికుల నుండి నిరసన సెగ తగిలింది. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ ఇంక్లైన్ బొగ్గు గనిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఈశ్వర్‌ను మహిళా కార్మికులు నిలదీశారు. మహిళా కార్మికులు కష్టాలు పడుతుంటే ఎనాడైన పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. ఈశ్వర్ బంధువులను గని లోపలికి దింపకుండా, పైన పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
అనారోగ్యంతో బాదపడుతున్న కార్మికులను గని లోపలికి దింపుతున్నారని ఆరోపించారు. ఏసీ రూంలో ఉండే మీకు మా కష్టాలు ఎలా తెలుస్తాయి అని ప్రశ్నించారు. వర్క్ షాపులో పనిచేస్తున్న మహిళా కార్మికులను మాకుమ్ముడిగా బదిలీ చేస్తే ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. మహిళా కార్మికుల మనోభావాలు దెబ్బ తింటున్నాయని, మహిళలను బలవంతంగా పనులు చేయిస్తున్నారని ఆరోపించారు. మహిళా కార్మికులు నిలదీయడంతో ఈశ్వర్ ప్రచారం చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయారు. న్యూస్ కవరేజి చేస్తున్న విలేకరులపై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ దురుసుగా ప్రవర్తించారు.