తీసుకున్న అప్పు చెల్లించలేదని సర్పంచ్ భర్త దౌర్జన్యంగా ఇంటికి తాళం వేసి ఆ కుటుంబాన్ని బయటకు గెంటివేసిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని సిరిచేల్మా గ్రామంలో సోమవారం రాత్రి సిరిచేల్మా గ్రామ సర్పంచ్ లక్ష్మి భర్త కన్నమయ్య అప్పు చెల్లించలేని కుటుంబాన్ని ఇంటికి తాళం వేసి బయటకు గెంటేశాడు. గ్రామంలోని రాజేందర్ అనే వ్యక్తి వద్ద నుంచి గ్రామానికి చెందిన గిరిజనుడు శ్రీనివాస్ 24 వేల రూపాయలు బాకి తీసుకుని తిరిగి చెల్లించినందుకు అప్పు ఇచ్చిన వ్యక్తి సర్పంచి భర్తను ఆశ్రయించాడు. సర్పంచ్ భర్త కన్నమయ్య గిరిజన కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు గెంటివేసి ఇంటికి తాళం వేయించిన సంఘటన చోటుచేసుకుంది.
ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధి ఈ విధంగా ఒక నిరుపేద కుటుంబాన్ని బలవంతంగా ఇంటి నుంచి బయటకు గెంటివేసి తాళం వేయడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత వ్యక్తికి న్యాయం జరిగే వరకు అంతా బాధితునికి అండగా ఉంటామని గ్రామస్తులు తెలిపారు. అలాగే సంఘటనకు బాధ్యుడైనటువంటి భర్త పైన క్రిమినల్ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.