Tuesday, November 26, 2024

The Truth – డబ్బున్న వారికే కాంగ్రెస్‌ టికెట్లు – బీసీలపై రేవంత్‌రెడ్డికి చిన్నచూపు

పెద్దపల్లి, అక్టోబర్‌ 17 (ప్రభన్యూస్‌): కాంగ్రెస్‌ పార్టీలో డబ్బున్న వారికే టికెట్లు కేటాయిస్తారని ఓదెల జడ్పిటిసి సభ్యుడు గంట రాములు సంచలన ఆరోపణలు చేశారు. పెద్దపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ పార్టీలో బీసీ ఎస్సీలను బానిసలుగా చూస్తున్నారని, టీపీసీసీ చీఫ్‌ రెవంత్‌ రెడ్డికి బీసీలపై చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. అగ్రవర్ణాలైన రెడ్డి, వెలమ, కమ్మలాంటి డబ్బున్న వారికే టికెట్లు- ఇచ్చి బీసీలను అవమానించారన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలోని 55 మందిలో ఏడుగురు వెలమ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో 45 ఏళ్లపాటు సేవలందించి పీసీసీ చీఫ్‌గా, మంత్రిగా సేవలందించిన బీసీ వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను బూతులు తిట్టి వెళ్లగొట్టడం అన్యాయమన్నారు. కానీ అదే పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాగం జనార్దన్‌ రెడ్డిని బతిమిలాడుకోవడం సిగ్గు చేటన్నారు.

అలాగే పెద్దపల్లి పార్లమెంట్‌- నియోజకవర్గంలో 2 వెలమ, ఒకటి బ్రాహ్మణ, మరొకటి వలస వచ్చిన బీసీ నాయకుడికి టికెట్లు ఇచ్చారని, టికెట్ల పంపిణీ ద్వారా స్థానిక బీసీలకు తీరని అన్యాయం చేశారని, దీనికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. టికెట్ల పంపిణీలో కర్ణాటక ఫార్ములాను అనుసరిస్తామని చెప్పిన నేతలు ప్రస్తుత టికెట్ల పంపిణీలో జరిగిన వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. బీసీ ఓట్లను కొల్లగొట్టేందుకు బీసీలకు టికెట్లు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ మాయమాటలు చెబుతుందని, నిజంగా చెప్పాలంటే బీసీల పట్ల కాంగ్రెస్‌ అసలు చిత్తశుద్ధి లేదన్నారు.

అలాగే రాహుల్‌ గాంధీతో రైస్‌ మిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేయడం వల్ల అంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదని, దీనిని బట్టి మిల్లర్ల నుంచి ఎవరు డబ్బులు దోచుకుంటున్నారో అర్ధమవుతుందన్నారు. తాను జడ్పీటీసీగా ప్రాతినిధ్యం వహిస్తున్నఓదెల మండలంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తన ప్రమేయం లేకుండా ఎలా కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం వైఖరికి నిరసనగా బుధవారం తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు సి. సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తిలతో కలిసి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి భవిష్యత్తు పై నిర్ణయం తెలియజేస్తానన్నారు. అలాగే ఇప్పటివరకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పెద్దలు ఎవరు కనీసం తనతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నించలేదని, ఇలాంటి పార్టీలో ఉండే అవసరం తనకు అస్సలు లేదన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement