Sunday, November 24, 2024

మాట నిలబెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం.. వడ్ల కొనుగోళ్లు పూర్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇచ్చిన మాటను రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఈ యాసంగిలో చివరి గింజ ధాన్యం వరకు కొనుగోలు చేసింది. రైతుల ప్రయోజనాలే పరమావధిగా భావించిన సీఎం కేసీఆర్‌… ఆర్థికభారం ఎంతైనా భరించి యాసంగి కొనుగోళ్లను ప్రారంభించారు. రైతాంగానికి తమ గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను తెరిచి ఎండనక, వాననకా నిరంతరం కొనుగోళ్లను చేపట్టారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసినా రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక నష్టాన్ని భరించి మరీ కొనుగోళ్లను చేపట్టిన విషయం విధితమే. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించాక రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారుల బెడద, రవాణా తదితర ఛార్జీల ఇబ్బందులు లేకుండా తమ గ్రామంలో ధాన్యాన్ని కనీస మద్ధతు ధరకు అమ్ముకోవడంతో రైతుల ఆదాయ వనరులు పెరిగాయి. స్వగ్రామంలోనే కనీస మద్దతు ధరకు ధాన్యాన్ని తక్కువ సమయంలో అమ్ముకునే వెసులు బాటురావడంతో రైతులు పెద్ద ఎత్తున వరిసాగుకు పూనుకున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం భారతదేశ ధాన్యగారంగా, దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా అనతికాలంలోనే అవతరించింది. వరిసాగులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న పంజాబ్‌ రాష్ట్రాన్ని తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానానికి చేరువ అయింది. కొత్త రాష్ట్రమైనప్పటికీ అనతికాలంలోనే రైతుల నుంచి ధాన్యం కొనుగోలులో అద్భుతమైన ప్రగతిని సాధించింది.

దేశంలో తెలంగాణ మినహా ఏ రాష్ట్రం కూడా రైతులు పండించిన వరి ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడం లేదు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత దేశంలో ఎన్నడూ… ఎప్పుడూ , ఎక్కడా లేనివిధంగా 2014-15 నుంచి 2021-22(వానాకాలం) వరకు ఏడు సంవత్సరాల్లో రూ.97,914 కోట్ల విలువైరన 5కోట్ల 56లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2014-15లో 24.29లక్షల మెట్రిక్‌ టన్నులు, 2015-16లో 23.56 లక్షల మెట్రిక్‌ టన్నులు, 2016-17లో 35.70లక్షల మెట్రిక్‌ టన్నులు, 2017-18లో 53.99లక్షల మెట్రిక్‌ టన్నులు, 2018-19తో 77.46లక్షల మెట్రిక్‌ టన్నులు, 2019-20లో కోటి 11లక్షలు, 2020-21లో కోటి41 లక్షల మెట్రిక్‌ టన్నులు, ఈ ఏడాది వానాకాలంలో 70.24లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ యాసంగిలో ఇప్పటి వరకు 50లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. గత ఏడాది 2020-21లో వానాకాలం, యాసంగి రెండు సీజన్‌లలో కలిపి 21.62లక్షల మంది రైతుల నుంచి కోటి 41లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం సేకరించింది. దాదాపు 12657 కొనుగోలు కేంద్రాలను తెరిచి … రూ.26, 610 కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రంగా 2020-21లో తెలంగాణ రాష్ట్రం పేరు సాధించింది.

చివరిదఫా ధాన్యం బకాయిలు చెల్లింపు…

ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్ల చెల్లింపు బకాయిలను సోమవారం సాయంత్రంలోగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ చెల్లింపు చేయనుంది. ఈ యాసంగిలో ఇప్పటి వరకు 51లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్నికొనుగోలు చేసినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.9715కోట్ల విలువైన ధాన్యాన్ని ఈ యాసంగిలో కొనుగోలు చేయగా… రూ.7464కోట్లు చెల్లింపులు పూర్తయ్యాయి. ఇంకా రూ.2251 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యానికి రైసుమిల్లు వద్ద నమోదు పూర్తికాగానే సోమవారం సాయంత్రం రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులను జమ చేయనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement