పెద్దపల్లి, ఆంధ్రప్రభ డిసెంబర్ 16: ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా జిల్లాలో ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుల సర్వే డిసెంబర్ 25 లోపు పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల సర్వే, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలలో బ్యాగ్ ఫీలింగ్ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ జరగాలని, రోడ్లపై చెత్త ప్లాస్టిక్ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, కంపోస్ట్ షెడ్ ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, గ్రామం నుంచి వచ్చే తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారు చేయాలన్నారు. ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఇందిరమ్మ ఇండ్ల యాప్ ఉపయోగిస్తూ సర్వే చేయాలన్నారు.
సకాలంలో సర్వే పూర్తి చేసేందుకు అవసరమైన మేర లాగిన్లు సిద్ధం చేసుకోవాలని, ప్రతి దరఖాస్తు ద్వారానే ఇంటికి వెళ్లి ప్రస్తుత స్థితి గతి తెలిసేలా ఫోటో యాప్ లో అప్లోడ్ చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియ డిసెంబర్ 25లోగా పూర్తి చేసే విధంగా ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, జడ్పి సీఈఓ నరేందర్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.