- వేరుశనగ పంటకు పెట్టిన విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి
- ఆందోళన చేసిన విద్యార్ధి సంఘాలు, ఆయా పార్టీల నాయకులు
- కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు
వనపర్తి ప్రతినిధి, డిసెంబర్ 21(ఆంధ్రప్రభ): పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం ఒక విద్యార్థి నిండుప్రాణాన్ని బలిగొంది. బిడ్డపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థి శనివారం విద్యుదాఘాతానికి గురై క్షణాల్లో ప్రాణాలను కోల్పోయాడు.
వివరాల్లోకి వెళితే.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దమారు గ్రామానికి చెందిన శిరీష -భాస్కర్ రావు కుమారులు హరీష్ (15), గౌతమ్ లు వనపర్తి శివారులోని తిరుమలయ్య గుట్ట వద్ద ఉన్న రెడియంట్ పాఠశాల హాస్టల్ లో ఉండి చదువుతున్నారు. పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న హరీష్, లోకేష్ లు ఎవరికీ తెలియకుండా ఉదయాన్నే పక్కనే ఉన్న వేరుశనగ పొలం వద్దకు వెళ్లారు. పొలానికి పెట్టిన కరెంట్ వైర్లు గమనించని హరీష్ వేరుశనగ కోసం దాటేoదుకు ప్రయత్నిస్తుండగా.. విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
అది చూసిన మరో విద్యార్థి వెంటనే పాఠశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్ధి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు బిడ్డను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనతో మిగిలిన విద్యార్థులను లోపల ఉంచి ఉపాధ్యాయులు పాఠశాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు.
ఆందోళన చేసి రోడ్డుపై ధర్నా చేసిన విద్యార్ధి సంఘాలు…
పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం కారణంగా ఓ విద్యార్థి విద్యుత్ షాక్ కు గురై మృతిచెందడంతో అక్కడికి చేరుకున్న విద్యార్ధి సంఘాలు నాయకులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. విద్యార్థి మృతికి కారణమైన పాఠశాల, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పాఠశాలను ముట్టడించారు. పోలీసులు ఆందోళనను అడ్డుకున్నారు.