Tuesday, November 26, 2024

NZB: రజకులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం ఆగదు.. మల్లేష్ కుమార్

నిజామాబాద్ సిటీ, ఆగస్టు 26 (ప్రభ న్యూస్): రజకులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం ఆగదని, రజకులు అందరూ ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధనకై ముందుకెళ్లాలని నేషనల్ కో ఆర్డినేటర్ కె.మల్లేష్ కుమార్ అన్నారు. ఎస్, సి రిజర్వేషన్ ఇచ్చిన పార్టీకే తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. శనివారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన రజక సంఘం జిల్లా సమావేశానికి నేషనల్ కో ఆర్డినేటర్ కె.మల్లేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం రజక సంఘం టౌన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రజక సంఘం టౌన్ అధ్యక్షుడిగా కనక రాజు, కార్యదర్శిగా శ్యామ్ సింగ్, కోశాధికారి ప్రభాకర్, ఉపాధ్యక్షులుగా సత్యనారాయణ, చిన్న సాయిలు, శివ కుమార్, రూపేష్, అశోక్, సహాయ కార్యదర్శులుగా విజయ్, శంకర్, గంగరాజు, శంకర్ సింగ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన కార్యవర్గానికి నియామక పత్రాలను అందజేశారు.

అనంతరం నేషనల్ కో ఆర్డినేటర్ కె.మల్లేష్ కుమార్ మాట్లాడుతూ.. 17 రాష్ట్రాల్లో రజకులకు ఎస్ సి రిజర్వేషన్ ఇచ్చారని, కేవలం 11రాష్ట్రాల్లో బీసీలుగా చేర్చారన్నారు. తెలంగాణలో నైజాం పాలన ఉండడంతో ఎస్ సి లుగా చేర్చలేక పోయారన్నారు. మిగితా కులాలకు తాము వ్యతిరేకం కాదని, వారి రిజర్వేషన్ 15 శాతం అట్లాగే ఉంచి తమకు అదనంగా రెండు శాతం కలిపి 17శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. అంటరాని బట్టలు ఉతుకుతున్న తమ కులస్తులకు ఎస్ సి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్ సి రిజర్వేషన్ ఇచ్చిన పార్టీకే తాము మద్దతు ఇస్తామన్నారు. ఎలక్షన్ కోడ్ రాక ముందు కేంద్రానికి సిఫారస్ చేయాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రజకులకు ఎస్సీ రిజర్వేషన్ కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు వర్సపల్లి నర్సింహులు రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాని, రాష్ట్ర కార్యదర్శి భూమేష్, యూట్యూబ్ ప్రధాన కార్యదర్శి యూత్ ప్రధాన కార్యదర్శి సాయి, యూత్ ఉపాధ్యక్షులు రవీందర్, రాష్ట్ర కమిటీ సభ్యులు అంజయ్య, రాష్ట్ర సాంస్కృతిక కన్వీనర్ పోశెట్టి, రజక కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement