Wednesday, November 20, 2024

కాషాయం జెండా బీజేపీ సొత్తే.. ఎమ్మెల్యే బిగాలపై మండిపడ్డ ధన్ పాల్..

నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 13 (ప్రభ న్యూస్) : ధర్మం కోసం.. ప్రజల కోసం పాటుపడే పార్టీ బీజేపీ పార్టీయేనని.. కాషాయం జెండా ముమ్మాటికి బీజేపీ సొత్తేనని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. గురువారం నిజామాబాద్ నగరం లోని ప్రగతి నగర్ లో గల భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ మాట్లాడారు. కాషాయం జెండాపై, బిజెపిపై అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బీగాల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాలకు కళ్ల‌ ముందు కనిపిస్తున్న పరిణామాలతో ఓటమి భయంతోనే తమపై అవాక్కులు.. చెవాక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బిగాల మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ బీజేపీ పార్టీ అని తెలిపారు. హనుమాన్ జయంతి శోభా యాత్రకు 9 సంవత్సరాల నుంచి అర్బన్ ఎమ్మెల్యే ఎందుకు రాలేవని ప్రశ్నించడంపై ఎమ్మెల్యే అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ నగర ప్రజలకు మీ కుటుంబం సొంత డబ్బుతో ఇప్పటి వరకు చేసిన సేవలు… మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము చేసిన సేవలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. డబ్బులు ఎక్కడ దానం చేసిన మా పేరును పెట్టుకోలేదు కానీ… అర్బన్ ఎమ్మెల్యేది చేసేది గోరంతా.. అయితే చెప్పుకునేది కొండంత అని విమర్శించారు. బిగాల కొన్ని మందిరాలకు నిధులు నేను ఇచ్చాను అని గొప్పలు చెప్పుకుంటున్నారు నువ్వు ఏమైనా మీ ఇంట్లోకెళ్లి.. నీ జేబులో నుంచి ఇచ్చినావా? బరాబర్ నువ్వు ఇయ్యాల్సిం దే? ప్రజల పన్నులతో కడుతున్న పైసలను నువ్వు మందిరాలకు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసారు. నీకు హిందువుల మీద నిజంగా ప్రేమ ఉంటే వెంటనే శంభుని గుడి చుట్టూ ఉన్న చెప్పుల దుకాణాలను వెంటనే తొలగించాలని ప్రశ్నించారు. కరోనా సమయంలో అన్నదానం చేశానని గొప్పలు చెప్పు కుంటున్న అర్బన్ ఎమ్మెల్యే నువ్వు సేవలు ఇప్పుడు ప్రారంభించావు.. మేము కొన్ని సంవత్సరాల క్రితమే నిజామాబాద్ నగర ప్రజల కోసం ధన్పాల్ ట్రస్ట్ నుంచి సేవలను ప్రారంభించామని తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం మాపై చేస్తున్న కల్లబొల్లి మాటలు అనవసరమైన ఆరోపణలకు భయపడేది లేదని హెచ్చరించారు. ఇటువంటి తాటాకు చప్పులకు భయపడే నాయకులు ఇక్కడ ఎవరు లేరు ఎంతోమంది నాయకులను ఇందూరు గడ్డ నుంచి చూసినం అందులో నువ్వు ఒకడివి నువ్వు మా ట్రస్ట్ గురించి మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. అయ్యప్ప మందిరానికి నేను ఏం చేశానో అక్కడ వెళ్లి అడగమని దేవుడి పేరు చెప్పి రాజకీయం చేయడం మీకు బాగా అలవాటైపోయిందనీ విమర్శించారు. అయ్యప్ప దేవుడి పై బైరి నరేష్ అనే మూర్ఖుడు అనుచిత వ్యాఖ్యలు చేస్తే నువ్వు గాని.. నీ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎందుకు స్పందించలేరనీ ప్రశ్నించారు. అంటే హిందువులని తిడితే నువ్వు మాట్లాడవా దీనికి సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. ఇంకో విషయం అభివృద్ధి మీద మాట్లాడుతున్నాడు నిజామాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి ఒక్కటి కూడా ఇవ్వని అసమర్ధ ఎమ్మెల్యే నువ్వు వెంటనే పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత 23 సంవత్సరాల నుంచి నేను రాజకీయంలోకి రాకముందు మా ట్రస్ట్ ధన్ పాల్ లక్ష్మీబాయి విట్టల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇందూరు నగరం లో సేవా కార్యక్రమం చేస్తున్నాననీ తెలిపారు. కోవిడ్ సమయంలో మొట్టమొదటగా నిజామాబాదులో 4500 మందికి నిత్యావసర సరుకుల 15 రోజులకు సరిపడే కిట్లను పేద ప్రజలకు అందిచామని తెలిపారు. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోం అన్నారు. ద‌మ్ముంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయు అని సవాల్ విసిరారు. నా టికెట్ మీద చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి అని అంటున్నావ్ నీ టికెట్ గురించి ఆలోచన చేయి ముందు నీ పార్టీ నాయకులే నువ్వు ఎమ్మెల్యేగా ఉంటే ఫ్లెక్సీలో నీ ఫోటోలు మాయం చేస్తున్నారు.. అక్కడే అర్థమవుతుంది నీకు టికెట్ ఉందా లేదా అనేది నా గురించి నువ్వేం మాట్లాడతావ్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్య దర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ,న్యాలం రాజు , జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, మున్సిపల్ ఫ్లోర్ లీటర్ గోపిడి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు పంచ రెడ్డి ,ప్రవళిక సుక్క మధు, మాస్టర్ శంకర్, ఎర్రం సుధీర్, మీసేవ శ్రీనివాస్, ఇప్పకాయల కిషోర్, అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ, యాదవ్ దళిత మూర్ఛ అధ్యక్షులు బి.ఆర్ శివప్రసాద్, మండల అధ్యక్షులు రోషన్ లాల్ బోరా, గడ్డం రాజు, బద్దంకిషన్, పంచ రెడ్డి శ్రీధర్, బిజెపి నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement