Monday, October 21, 2024

KNR | పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది.. కరీంనగర్ సీపీ

ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, (ఆంధ్ర ప్రభ ): పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద సోమవారం ఫ్లాగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి హాజరయ్యారు. అమరవీరుల విగ్రహానికి కరీంనగర్ సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం దేశవ్యాప్తంగా అమరులైన పోలీసులను స్మరించుకున్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ తో పాటు ఇతర పోలీసు అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పోలీసు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారంతా పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించారు.

ఈ సందర్బంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి మీడియాతో మాట్లాడుతూ… పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా దేశ రక్షణ కోసం, సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో భాగంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసులను ఫ్లాగ్ డే సందర్భంగా స్మరించుకుని నివాళులర్పించామన్నారు. దేశవ్యాప్తంగా 200 మందికి పైగా పారా మిలిటరీ, రాష్ట్ర పోలీసులు అమరులయ్యారన్నారు.

వారి త్యాగాలు ఎప్పటికీ వృధా కావన్నారు. అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ప్రశాంతంగా ఉండేలా, శాంతి భద్రతలు కాపాడే విధంగా విధులు నిర్వహిస్తామన్నారు. అమరుల కుటుంబ సభ్యులతో పోలీస్ కమీషనర్ మాట్లాడి వారి సేవలను కొనియాడారు. వారికి గల సమస్యలను తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement