Tuesday, January 7, 2025

ADB | రైతుల అభివృద్ధికి పాలకవర్గం కృషి చేయాలి : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

జన్నారం, (ఆంధ్రప్రభ) : రైతుల అభివృద్ధికి నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం కృషి చేయాలని, రైతులకు మేలు చేసే పనులు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అన్ని వర్గాలకు మేలు చేకూరేలా పాలకవర్గాన్ని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం రైతన్నలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త జనం మెచ్చే నాయకుడిగా ఎదగాలని, క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

- Advertisement -

అమ్ముడుపోయే తత్వం తనది కాదని, ప్రజాసేవే తన లక్ష్యమని ఆయన చెప్పారు. కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరికీ సమన్యాయం జరిగేలాగా చూస్తానని ఆయన తెలిపారు. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు వార, దినసంతను సకల సౌకర్యాలతో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ముందుగా నూతన ఎన్నికైన చైర్మన్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ ఫసిహుల్ల, డైరెక్టర్లు ముత్యం రాజన్న, ఎల్ల లావణ్య,బి. రాజన్న, నర్సయ్య, సోనేరావు సత్య గౌడ్, తిరుపతి,పి.లావణ్య, ఆర్.ప్రదీప్, బి.సత్తయ్యలచే జిల్లా మార్కెటింగ్ అధికారి షాహబోద్దీన్, శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ముజఫర్, మాణిక్యం, పార్టీ సీనియర్ నేతలు మిక్కిలినేని రాజశేఖర్, సయ్యద్ ఇసాక్,గుర్రం మోహన్ రెడ్డి, రమేష్ రావు,తదితరులు పాల్గొన్నారు.

రాత్రివేళ వాహనాల రాకపోకల నిలిపివేతపై ఎమ్మెల్యే అగ్రహం

టైగర్ జోన్ పేరిట రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యన జన్నారం మీదుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, నిర్మల్ జిల్లా కడెం, దస్తురాబాద్, మంచిర్యాల జిల్లాకు వాహనాల రాకపోకల అనుమతి రద్దు చేస్తూ మంచిర్యాల సి.ఎఫ్, కేటీఆర్ డివిజన్ ఎఫ్డీపీటీ ఎస్. శాంతరాం ఆదేశాలు జారీ చేయడం పట్ల ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆగ్రహంవ్యక్తం చేశారు.

ఆదివారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ…. ఫారెస్ట్ అధికారులు వాహనాల రాకపోకలపై అనుమతి రద్దు చేయడం సరికాదన్నారు. తాను రాష్ట్ర వైల్డ్ లైఫ్ బోర్డు మెంబర్ అని,తనకు ఎలాంటి సమాచారం లేకుండా ఎఫ్డీపీటీ వాహనాల అనుమతులు రద్దెలా చేస్తారో చెప్పాలన్నారు.

ఎన్నడూ లేని విధంగా ఈ ఆంక్షలను విధించడం సరికాదని, దీని మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. చిన్న వాహనాల అనుమతిపై సీఎం రేవంత్ రెడ్డి, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement