ఆసరా పింఛన్లు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేసి, వారి నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ మోసగాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఇవ్వాల (ఆదివారం) అరెస్టు చేశారు. అతని నుంచి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని రెడ్డివాడకు చెందిన బైరగోని లింగయ్య జిల్లాలోని మారుపాక గ్రామానికి చెందిన బోయిన సుజాతకు ఆసరా పింఛన్ ఇప్పిస్తానని ఆమె నుంచి డబ్బులు తీసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఆమెకు పింఛన్ ఓకే చేయించినట్టు చెప్పాడు. ఈ విషయాన్ని నమ్మించేందుకు నెలనెలా సుజాత అకౌంట్‌లో రూ.2వేల జమచేశాడు.
ఈ విషయం చుట్టుపక్కల అందరికీ తెలిసేలా చేశాడు. సుజాత కూడా బైరగోని లింగయ్య నిజంగా పింఛన్లు ఇప్పిస్తాడని అందరికీ చెప్పింది. ఇదే అదునుగా పడిగెల నాగవ్వ, పడిగెల అపర్ణ, కుమ్మరి భాగ్యకు కూడా పెన్షన్ ఇప్పిస్తానని లింగయ్య నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి రూ.13,500 చొప్పున మొత్తం రూ.40,500 వసూలు చేశాడు. అప్పట్నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు లింగయ్యను అరెస్టు చేశారు. అతని దగ్గర ఉన్న పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇట్లా మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.