మహేశ్వరం నియోజకవర్గములో తాగునీటి సమస్యలు రాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే ఇంటింటికి నల్లా కార్యక్రమాన్ని దాదాపు పూర్తి చేసినట్లు, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పది గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ లు, పైప్ లైన్ల కోసం మరో రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈరోజు మంత్రి మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ఈ పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పాత, శిథిలావస్థ ట్యాంకుల స్థానంలో కొత్త వాటితో పాటు, అవసరమున్న చోట నూతనంగా నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందులో మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామంలో రూ.22 లక్షలతో, పోరండ్ల, గంగారాం తాండలలో రూ.20 లక్షలతో, నాగారం గ్రామంలో రూ.12 లక్షలతో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అదేవిధంగా కందుకూరు మండలంలో కందుకూరు గేట్ వద్ద రూ.29 లక్షలతో, కొత్తగూడా గ్రామంలో పోచమ్మ దేవాలయం వద్ద రూ.20 లక్షలతో, పద్మావతి కాలనీలో రూ.12 లక్షలతో, గూడూరు గ్రామంలో రూ.22 లక్షలతో, బాచుపల్లి, చిప్పలపల్లి గ్రామాల్లో రూ.12 లక్షల చొప్పున వెచ్చించి ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. రానున్న వేసవి కాలం లోపు తాగునీటికి సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజల కనీస సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital