Sunday, November 17, 2024

Special Story: మండలాల సాధనకు మళ్లీ ఉద్యమ బాట..

దీక్షలకు కూర్చోనున్న గ్రామస్తులు
పాత గ్రామాలను పాత మండలాల్లోనే కలపాలని డిమాండ్
మూడు మండలాల ఏర్పాటు కోసం వినతులు
పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి
అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన పార్టీలు
ఉద్యమ కార్యాచరణకు కసరత్తు
ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలు

ప్రభన్యూస్, ప్రతినిధి /యాదాద్రి : తమకు అసౌకర్యంగా ఉన్న మండలాల్లో తమ గ్రామాలను చేర్చడాన్ని నిరసిస్తూ కొందరు.. తమకు కొత్త మండలాన్ని ఇవ్వాలని మరికొందరు మళ్లీ ఉద్యమ బాట పట్టనున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.. కొత్త మండలాలు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా కూడా.. అవి సాధ్యం కాకపోవడంతో ఏకంగా నిరాహార దీక్షలకు, పోరాటాలకు దిగిన రఘునాథపురం, ఆరూరు- వేములకొండ గ్రామస్తులు అఖిలపక్షం ఆధ్వర్యంలో మరో ఉద్యమానికి సన్నద్ధమయ్యారు.. ఆలేరు, ఆత్మకూరు తదితర మండలాల్లో గ్రామాలను మోటకొండూరు మండలంలో కలుపగా ఆయా గ్రామాల ప్రజలు తమకు పాత మండలాల్లోనే సౌకర్యంగా ఉన్నాయని ఎన్నికల సందర్భాల్లో ప్రచారానికి వచ్చిన అభ్యర్థులను కలిసి వివరించారు..

తమను పాత మండలాల్లోనే కొనసాగించాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేసారు.. ఎన్నికల తర్వాత పరిష్కరిస్తామన్న హామీలు ఇచ్చి వెళ్లారు.. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 8నెలల తర్వాత కూడా తమ డిమాండ్ కు కార్యాచరణ రాకపోవడంతో తిరిగి నిరసన బాటను పట్టేందుకు ఆయా గ్రామాల ప్రజలు నిర్ణయించారు.. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు..

మూడు మండలాల ఏర్పాటు కోసం డిమాండ్..
యాదాద్రి భువనగిరి జిల్లాలో 17మండలాలు, 421 గ్రామ పంచాయితీలు, 229 అవాస గ్రామాలు ఉన్నాయి. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు, గ్రామాలను ఏర్పాటు చేశారు. మండలాల ఏర్పాటు జరిగిన అనంతరం నూతన గ్రామాలు, మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది.. రాజాపేట మండలంలోని రఘునాథపురం, వలిగొండ మండలంలోని అరూర్, వేములకొండ, తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామాలను పక్కన ఉన్న గ్రామాలను కలుపుకొని మండలం చేయాలని డిమాండ్ తెరపైకి వచ్చింది..

- Advertisement -

గతంలో వినూత్న రీతిలో నిరసనలు..
నూతనంగా ఏర్పాటు జరిగే మండలాలను ఏ గ్రామాలను కలుపుకొని చేయాలో పలు గ్రామాల నాయకులు, గ్రామస్తులు సూచించారు. జిల్లాలోని రఘునాథపురం, అర్రూర్, వేములకొండ మండలాలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో దీక్షలు, నిరసనలు చేశారు. రోజుకో కొత్తధనంతో రాస్తారోకోలు, వంటా వార్పు, నిరాహార దీక్షలు, బైక్ ర్యాలీలు, పాదయాత్రలు, జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా, వినతి పత్రం అందజేస్తూ నిరసన తెలిపారు. రఘునాథపురం మండలంలో చల్లురు, కాల్వపల్లి, బసంతాపురం, కాచారం, ధర్మారెడ్డి గూడెం, చిన్న గౌరయిపల్లి, గౌరయిపల్లి, సాధువేల్లి, దూదివేంకటాపురం గ్రామాలను కలుపుకొని మండలంగా ఏర్పాటు చేయాలని 424 రోజులు పొత్తిమర్రి వద్ద దీక్షలు చేశారు. తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామాన్ని మండలం చేయాలని నాగాయపల్లి, గోపాలపురం, నాగాయపల్లి తండా, పల్లె పహాడ్, చిన్న లక్ష్మాపూర్, ధర్మారం, పెద్దతండా, గుండ్లగూడెం, గోవింద్ తండా, చౌదరిపల్లి, వీరస్వామి తండాలతో అవాస గ్రామాలను కలుపుకొని మండలం చేయాలని కోరుకుంటున్నారు.

మత్యాద్రి అరూర్ వేములకొండ గా గెజిట్ విడుదల..
వలిగొండ మండలంలోని అర్రూర్, వేములకొండ మండలంలో వెంకటా పురం, ముగుతాపురం, గోపారాజుపల్లి, నర్సాపురం, దుప్పేల్లి, చిత్తపురం, జంగారెడ్డిపల్లి, ఎం.తుర్కపల్లి, గురునాథ్ పల్లి, నర్సయ్య గూడెం గ్రామాలను కలుపుకొని ఏర్పాటు చేయాలని, అర్రూర్, వేములకొండ గ్రామాలు రెండు దగ్గర దగ్గరాగానే ఉండడంతో మా గ్రామాన్నే మండలం చేయాలని గ్రామ పంచాయతీల వద్ద 4వందల రోజులకు పైగా దీక్షలు కూడా చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ కు 3 రోజుల ముందు మత్యాద్రి అరూర్ వేములకొండగా గత ప్రభుత్వం గేజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

గతంలో నాయకుల హామీలు…
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నూతన మండలాలను ఏర్పాటు చేయాలని కోరుతూ నాయకులు హామీలను ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సైదాపురం సభలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ పాదయాత్రలో, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క లు రఘునాథపురం గ్రామంలో నిర్వహించిన సభలో, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలు హామీ ఇచ్చారు.

ఉద్యమ కార్యాచరణకు సమాయత్తం..
నూతన మండలాల ఏర్పాటు కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణకు సమాయత్తం అవుతున్నారు. ఎన్నికల హామీల ప్రకారం నూతన మండలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై రఘునాథపురం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. అఖిలపక్ష నాయకులతో కలసి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను కలసి అసెంబ్లీలో మాట్లాడాలని కోరుతూ వినతి పత్రాలను సమర్పించారు. పంచాయితీ ఎన్నికలకు ముందే నూతన మండలాలను ఏర్పాటు చేయాలని భారాస యువజన విభాగం అధ్యక్షుడు పల్లె సంతోష్ గౌడ్, కోశాధికారి కట్కం స్వామి, మండల ఉపాధ్యక్షులు కట్కం వెంకటేశం, భోగరాజు, కొండంరాజు, నరేందర్ లు ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు.

ఎన్నికల హామీలు నెరవేర్చాలి
పల్లె సంతోష్ గౌడ్, భారాస యువజన విభాగం మండల అధ్యక్షుడు – రఘునాథపురం
గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచార సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పాదయాత్ర చేపట్టిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.
రఘునాథపురం గ్రామం చుట్టూ ఉన్న గ్రామాలు చల్లురు, కాల్వపల్లి, బసంతాపురం, దూదివేంకటాపురం, కాచారం, ధర్మారెడ్డిగూడెం, గౌరయిపల్లి, చిన్న గౌరయిపల్లి, సాధువేల్లి, కమాటం గూడెం గ్రామాలను కలుపుకొని మండలంగా ఏర్పాటు చేయాలి.

మత్యాద్రి మండలం ఏర్పాటు చేయాలి… కొత్త రామచంద్రం, వెంకటాపురం
వేములకొండ గ్రామంతో పాటు పలు గ్రామాలు మచ్చాద్రి వేములకొండ మండలం కావాలని 360 రోజులు ధర్నా నిర్వహించారు. అందుకు ప్రతిఫలంగా గత నవంబర్ లో రాష్ట్ర ప్రభుత్వం మత్యాద్రి వేములకొండ ఆరూర్ మండలంగా ప్రకటన చేసింది. ఇక్కడి ప్రజలు వలిగొండకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గమనించి మచ్చాద్రి వేములకొండ అనే పేరుతో నూతన మండలం వెంటనే ఏర్పాటు చేయాలి.

పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి… కట్కం స్వామి, రఘునాథపురం
ప్రజల సౌలభ్యం, పాలన వికేంద్రీకరణ కోసం ప్రభుత్వమే నూతన మండలాలను ఏర్పాటు చేయాలి. దీంతోనే అభివృద్ధి జరుగుతుంది. మండలం ఏర్పాటుతో ప్రజలకు సుపరిపాలన అందుతుంది. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు చేరుతాయి. మండల ఏర్పాటు కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాము.

మాదాపూర్ ను మండలంగా ఏర్పాటు చేయాలి…బుసాని వెంకటేష్, ఆలేరు మాజీ మార్కెట్ డైరెక్టర్
తుర్కపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామం చుట్టూ ఉన్న గ్రామాలను కలుపుకొని మాదాపూర్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి. శాసన మండలి సభ్యుడు చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న) ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. పాలన వికేంద్రీకరణతో అభివృద్ధి జరుగుతుంది. గిరిజన తండాలు అధికంగా ఉన్నాయి.. కావున మండలం ఏర్పాటు అవసరం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement