వరంగల్: మహాత్మా జ్యోతిరావు ఫూలే 195వ జయంతి సందర్భంగా హన్మకొండ, ములుగు క్రాస్ రోడ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు ఫూలే సత్యశోధన సమాజాన్ని స్థాపించి సమానత్వం కోసం, మహిళలు చదువుకోవాలని ఆరాటపడ్డారనీ, అణగారిన వర్గాల కోసం ఎంతో శ్రమించారనీ అన్నారు. ఆ పోరాటం స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు.
కట్టుబాట్లను వ్యతిరేకించి తన భార్యను చదివించడమే కాకుండా టీచర్‌గా కూడా చేశారన్నారు. అందుకే ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయుల కృషిని నేటికీ గుర్తుంచుకుంటామనీ, అలాంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని మంచి చేయాలన్నారు. సమాజంలో సన్మార్గంలో నడుస్తూ ఉత్తమ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలనీ యువతకు పిలుపునిచ్చారు. రానున్న పోటీ పరీక్షలకు విద్యార్థులు మంచిగా ప్రిపేర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనీ కోరారు. కార్యక్రమంలో హన్మకొండ ఇన్స్పెక్టర్ వేణుమాధవ్, ఎస్సైలు రాజ్ కుమార్ , సురేష్ తదితరులు పాల్గొన్నారు.