Tuesday, October 22, 2024

ADB | రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమ బాట.. జోగు రామన్న

24న ఆదిలాబాద్ లో కేటీఆర్ బహిరంగ సభ..
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమ బాట చేపడుతుందని, ఈనెల 24న ఆదిలాబాద్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జోగు రామన్న సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, రైతు భరోసా ఎగ్గొట్టి ప్రభుత్వం రైతుల ఉసురు తీసుకుంటోoదన్నారు. ఆరు గ్యారంటీల పేరిట అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం మహిళలకు ఉచిత బస్సు మినహా మిగతా గ్యారంటీలు అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

కేసీఆర్ పాలనలో రైతుల ఆత్మహత్యలు లేనీ రాష్ట్రంగా పథకాలు అమలు చేస్తే, 300 రోజుల పాలనలో ఇప్పటికీ 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని జోగు రామన్న ఆరోపించారు. ఎకరానికి తమ ప్రభుత్వం పదివేల రైతుబంధు ఇస్తే, అవహేళన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే రూ.15,000 ఇస్తామని నమ్మించి మోసగించారన్నారు. కేబినెట్ సబ్ కమిటీ పేరిట కాలయాపన చేస్తూ రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం తీరును రాష్ట్రవ్యాప్తంగా ఎండగడతామన్నారు. పత్తికి గుజరాత్ మార్కెట్లో ఒక ధర కల్పించి రాష్ట్రంలో రు.7520 ప్రకటించడం పట్ల ఎద్దేవా చేశారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు, పెళ్లిళ్లు చేసుకున్న పేదలకు తులం బంగారం, రుణమాఫీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఉచిత కరెంటు పేరిట మాయమాటలు చెప్పి నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు.


ఈనెల 24న కేటీఆర్ శంఖారావం..
రైతాంగ సమస్యలే ప్రధాన ఏజెండాగా కులమత రాజకీయాలకు అతీతంగా రైతు ఉద్యమాలను చేపడుతున్నామని జోగు రామన్న తెలిపారు. ఈనెల 24న ఆదిలాబాద్ లో మాజీ మంత్రి కేటీఆర్ శంఖారావం పూరించనున్నారని, ఈ బహిరంగ సభకు రైతులందరూ హాజరుకావాలని జోగు రామన్న కోరారు. రైతు సమస్యలపై నిలదీస్తే ప్రశ్నించే గొంతుకులపై కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.

- Advertisement -

సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తే తనపై కేసులు పెట్టారని, 420 హామీలు ఇచ్చి మోసగించిన సీఎం రేవంత్ రెడ్డిపై 420 చీటింగ్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మెట్టు ప్రహ్లాద, రోకoడ్ల రమేష్, విజ్జగిరి నారాయణ, మాజీ ఎంపీపీ రమేష్, కౌన్సిలర్లు అల్లాల అజయ్, పవన్ నాయక్, రంగినేని శ్రీనివాస్, కుమ్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement