కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి కావడంతో గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కళాశాలలో పాసింగ్ అవుట్ పరేడ్ ప్రారంభమైంది. కరీంనగర్ రాంనగర్ నందు గల పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ లకు చెందిన 1103 మంది స్టైఫండరీ ట్రైనీ పోలీస్ కానిస్టేబల్స్ సివిల్ అండ్ ఏఆర్ – 2024 బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నందున నిర్వహిస్తున్న పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా అవినీతి నిరోధక శాఖ డీజీ విజయ్ కుమార్ హాజరయ్యారు.
కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ డీజీకి స్వాగతం పలికారు. పాసింగ్ అవుట్ పరేడ్ లో ట్రైనీ కానిస్టేబుళ్లు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ… క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ అని శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.