Friday, November 22, 2024

Delhi | పార్టీని ఎప్పుడూ ఏదీ అడగలేదు.. బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తా: కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తానని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వెల్లడించారు. తనకు ఎలాంటి అలక, అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. బీజేపీ పెద్దలు బండి సంజయ్ స్థానంలో కిషన్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించిన అనంతరం బుధవారం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరులతో కాసేపు చిట్‌చాట్ చేశారు. అనంతరం కిషన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిన్న తాను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి విషయం చెప్పారని తెలిపారు.

తాను గతంలో ఉమ్మడి ఏపీకి రెండు సార్లు, తెలంగాణ తొలి బీజేపీ అధ్యక్షుడిగా కూడా పని చేశానని, మళ్లీ నాలుగోసారి అధిష్టానం తనకు బాధ్యత అప్పజెప్పిందని చెప్పుకొచ్చారు. ఎంపీగా గెలిచాక హోం శాఖ సహాయ మంత్రిగా, ఆ తర్వాత రెండేళ్లు కేబినెట్ మంత్రిగా పదోన్నతి ఇచ్చారని గుర్తు చేశారు. తాను ఏనాడూ పార్టీని ఏదీ అడగలేదని, ఏదీ కోరలేదని కిషన్‌రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ వస్తున్నానని వివరించారు. పార్టీ నాయకత్వం మార్పులు చేర్పులు అన్నీ ఆలోచించే చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 1980 నుంచి ఒక సైనికుడిలా పని చేస్తూ వచ్చానని వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో సమష్టి ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు.

హైదరాబాద్ బయలుదేరి వెళ్తున్నానని, రాత్రి పార్టీ ముఖ్య నేతలను కలిసి మాట్లాడతానని వెల్లడించారు. ప్రధాని వరంగల్ పర్యటనకు ఇంకా రెండు రోజులే సమయం ఉంది కాబట్టి ఏర్పాట్లు చూసుకోవాలని అన్నారు. పార్టీ నాయకత్వం, శ్రేణులు ఏర్పాట్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని రైల్ వ్యాగన్ తయారీ కేంద్రం కు భూమి పూజ చేస్తున్నారని, 150 ఎకరాల స్థలంలో ఈ పరిశ్రమ రానుందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. రైల్వే ఓవర్ హాలింగ్ యూనిట్ అని తొలుత అనుకున్నా, ప్రధాని వ్యాగన్ యూనిట్ పెట్టడానికి ఓకే చెప్పారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద వర్క్ షాప్, తయారీ యూనిట్ రావడం ఇదే మొదటిసారని అన్నారు.

- Advertisement -

రైల్వే యూనిట్‌ను ప్రధాని వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని కేంద్రమంత్రి చెప్పారు. దీంతోపాటు ప్రధాని ఆరు వేల కోట్ల విలువైన నూతన జాతీయ రహదారులకు భూమి పూజ చేస్తారని, వరంగల్ ఎయిర్ స్ట్రిప్ ద్వారా నేరుగా హెలికాప్టర్‌లో వచ్చి భద్రకాళి దర్శనం చేసుకుంటారని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన విజయవంతం చేయడానికి ప్రయత్నాలు చేస్తామని వివరించారు. జూలై 9న దక్షిణ భారత రాష్ట్రాల బీజేపీ ముఖ్య నేతల సమావేశం హైదరాబాద్‌లో జరుగుతుందని కిషన్‌రెడ్డి వివరించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీని పటిష్టం చేయడం గురించి చర్చిస్తామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement