Friday, September 20, 2024

TG: అరికెపూడి- కౌశిక్ రెడ్డి మ‌ధ్య కొన‌సాగుతున్న మాటల యుద్ధం

“ఒక బ్రోకర్ వచ్చి సీనియర్ శాసన సభ్యుడి ఇంటి వద్ద బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని చెప్పడంలో అర్థం ఏమిటి ? వీడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయి ఎన్ని రోజులు అయింది ? హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు బ్రోకరిజం చేసిన వ్యక్తి నాపై సవాల్ విసిరితే… ఒక సీనియర్ ఎమ్మెల్యేగా నేను చేతకానివాడినా?” అంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నిప్పులు చెరిగారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని, తాను ఆయన ఇంటికి వెళ్లి పార్టీ కండువా కప్పుతానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిన్న సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అరికెపూడి ఇంటి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరి ఇళ్ల వద్ద పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి సవాల్‌పై అరికెపూడి తీవ్రంగా స్పందించారు. కౌశిక్ రెడ్డి కనుక 10 గంటలకు తన ఇంటికి రాకపోతే తానే 12 గంటలకు ఆయన ఇంటికి వెళ్తానన్నారు. తాను బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాననే విషయం అందరికీ తెలుసు అన్నారు. కౌశిక్ రెడ్డికి, తనకు మధ్య మాటల యుద్ధం సాగుతోందన్నారు.

- Advertisement -

మీరు కాంగ్రెస్ పార్టీలో చేరారా? అని మీడియా ప్రశ్నించగా, అరికెపూడి గాంధీ స్పందిస్తూ… 65 మంది కాంగ్రెస్, 38 మంది బీఆర్ఎస్, 8 మంది బీజేపీ, 7 గురు మజ్లిస్, 1 కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఉన్నారని సభాపతి చాలా స్పష్టంగా ప్రకటించారని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రిని కలవడం సహజమే అన్నారు.

తనకు కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవన్నారు. కేసీఆర్ తనకు ప్రాధాన్యతను ఇచ్చారని, ఆయనను ఎప్పటికీ గౌరవిస్తామన్నారు. కానీ పార్టీలో కొంతమంది బ్రోకర్లు ఉన్నారని మండిపడ్డారు. వారు మాట్లాడిన తీరు గమనించాలని కోరారు. అనర్హత వేటు అంశంపై స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. న్యాయస్థానాలను గౌరవిస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement