హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. సిటీ నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాథులు హుస్సేన్‌సాగర్ వైపు బారులు తీరారు. దీంతో అబిడ్స్, లక్డీకపూల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, తిలక్‌నగర్, కోరంటి ఫీవర్ హాస్పిటల్ దాకా బొజ్జ గణపయ్యలు నిలిచిపోయారు. ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ నుంచి వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మర్గాలను చూసుకోవాలని అధికారులు సూచించారు.
కాగా, పాతబస్తీ వైపు నుంచి పెద్ద సంఖ్యలో వినాయకులు తరలి వచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయానికి మొహంజా మార్కెట్ చౌరస్తాను పోలీసులు క్లియర్ చేశారు. సాధారణ వాహనాలకు అనుమతిస్తున్నారు. అదేవిధంగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పై నుంచి మరికాసేపట్లో వాహనాలను వదలనున్నారు. గురువారం అర్ధరాత్రి ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. డీజే చప్పుల్లు, డప్పుల మోతలు, యువతీ యువకుల హుషారెత్తించే నృత్యాలతో గణేశ్ నిమజ్జనం కొనసాగింది. నిమజ్జనానికి పోలీసులు భారీ బందోబస్తు కల్పించారు. 20 వేలకుపైగా సీసీ కెమెరాలతో నగరం మొత్తం నిఘా పెట్టారు. రాష్ట్ర పోలీసులతోపాటు ఆర్పీఎఫ్, రైల్వే ఫోర్స్, కేంద్ర బలగాల సేవలను వినియోగించుకున్నారు. ఇవ్వాల (శుక్రవారం) మధ్యాహ్నం ఒంటి గంట వరకు కానీ నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు.