ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసులో కీలక నిందితుడైన అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనే వాదన తప్పు అని ఆయన తెలిపారు. ప్రభాకర్‌ను ఇండియాకు రప్పించే యత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.
అదేవిధంగా ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదని, లుక్ అవుట్ నోటీసులు మాత్రం జారీ చేశామని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌ను సంప్రదించలేదని సీపీ క్లారిటీ ఇచ్చారు. ట్యాపింగ్ ఏ స్థాయిలో జరిగిందనే విషయం త్వరలోనే తేలుస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు కేసుకు సంబంధం ఉన్న రాజకీయ నాయకుల వ్యవహారంపై కూడా స్పందిస్తామని సీపీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.