హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. తాజాగా ముగ్గురికి అదనపు న్యాయమూర్తులుగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడంతో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా ఉన్న సుజనా కలాసికంకు పదోన్నతి వచ్చింది. ఆమెను హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. అదే విధంగా సీనియర్ న్యాయవాదులు అనిల్‌కుమార్ జూకంటి, లక్ష్మినారాయణ అలిశెట్టి కూడా అదనపు న్యాయమూర్తులుగా నియమితులయ్యారు. అనిల్‌కుమార్ జూకంటి 20 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. టాక్సేషన్, సివిల్, క్రిమినల్ లాలో దిట్ట. లక్ష్మినారాయణ 26 సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో ఉన్నారు. రిట్ లిటిగేషన్లు, మధ్యవర్తిత్వం, సివిల్ అండ్ కమర్షియల్ లిటిగేషన్స్ కేసులు వాదించడంలో పేరు గడించారు.
2022 అక్టోబర్ 23న వారి నియామకానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని కొలీజియం న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసింది. హైకోర్టు సిఫార్సులకు సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆమోదించి రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేయడంతో కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ వారి నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకట్రెండు రోజుల్లో ఈ ముగ్గురు అదనపు న్యాయమూర్తులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతో కలిపి న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరనుంది. హైకోర్టులో నంబర్ టూ జడ్జిగా జస్టిస్ శ్యాంకోషీ ఉంటారు.