ఖమ్మం ఉమ్మడి బ్యూరో, డిసెంబర్ 14 (ఆంధ్రప్రభ) : గిరిజన సంక్షేమ శాఖ ఇన్స్టిట్యూషన్లలో గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మెనూ, డైట్ చార్జీలు తప్పనిసరిగా అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ చేనేత మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాల సందర్శనకు వచ్చిన మంత్రికి, అధికారులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్సియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు చదువుతో పాటు డైట్ మెనూ, కాస్మోటిక్ చార్జీలు విస్తృతంగా పెంచిందని, పెరిగిన చార్జీలు గతంలో మూడు నుంచి ఏడవ తరగతి విద్యార్థులకు 950 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 1330 రూపాయలు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గతంలో 1100 ఉండగా, ప్రస్తుతం 1540 రూపాయలు, అలాగే ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు గతంలో 1500 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 2100 రూపాయలు, కాస్మోటిక్ చార్జీలు విద్యార్థినులకు గతంలో 75 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 275 రూపాయలు, విద్యార్థులకు గతంలో మూడవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు 62 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 150 రూపాయలు, ఎనిమిదవ తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు గతంలో 62 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 200 రూపాయలు పెంచిందన్నారు. దమ్మపేట మండలం గండుగులపల్లి ఏకలవ్య పాఠశాలలో ఈ రోజు నుంచి పెంచిన చార్జీలు రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి వచ్చినందున ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.
సంబంధిత ప్రిన్సిపాల్, వార్డెన్లు తప్పనిసరిగా నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. ఈ కార్యక్రమంలో అశ్వరావు పేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, ఈఎంఆర్ఎస్ ఓఎస్ డి, అబ్జర్వర్ కృష్ణారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో బి రాహుల్, ఆర్ సి ఓ నాగార్జున రావు, కళాశాల ఫ్యాకల్టీలు, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.