మార్చి 28, 29వ తేదీల్లో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మేను విజయవంతం చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి పోచమ్మ మైదాన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏ ఐ టి యూ సి జిల్లా కార్యదర్శి గన్నారం రమేష్, సి ఐ టి యు జిల్లా సహాయ కార్యదర్శి ముక్కెర రామస్వామి, టీఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షుడు భోగి సురేష్ , ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గంగుల దయాకర్, ఐ ఎన్ టి యు సి జిల్లా కార్యదర్శి పుల్ల రమేష్ పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశాన్ని పెట్టుబడిదారులకు, బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టే విధంగా ప్రయత్నం చేస్తోందని యూనియన్ లీడర్లు అన్నారు. జాతీయ సహజ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని విమర్శించారు. రెండు సంవత్సరాల నుండి కొవిడ్ సంక్షోభంలో కార్మికులు సామాన్య ప్రజలు బతుకులు అతలాకుతలమైనా ఆదుకునేందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజల కొనుగోలు శక్తి లేకుండా బిజెపి చేస్తుందని మండిపడ్డారు.
పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కో డ్ లుగా విభజించి పెట్టుబడిదారుల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం , అదాని, అంబానీ లాభాల కోసం నిర్వీర్యం చేస్తూ.. కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా బిజెపి ప్రభుత్వం కంకణం కట్టుకుందని కార్మిక సంఘాల నేతలు అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగే సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆల్ ట్రెడ్ యూనియన్ నాయకులు ఇనుముల శ్రీనివాస్,
ఎండి మహిబుబ్ పాషా, గున్నాల ప్రభాకర్, ఎం డి బషీర్. గాదె కుమార్, జీవన్, అనీల్, సంజీవ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.