పెద్దపల్లి, (ప్రభన్యూస్): ఏ క్షణంలో తనువు చాలిస్తానో తెలియదు.. నాకు 100 ఏళ్ల వయసు.. నీకు 70 ఏళ్లు ఉంటాయి.. కడుపు చించుకొని పుట్టిన నువ్వు కంట కనబడకుండా పోయి 45 ఏళ్లు దాటిపోయాయి.. చిన్నపుడు నా దగ్గర పెరిగినప్పటి నీ జ్ఞాపకాలే తప్ప మరేమీ నా వద్ద లేవు.. ఇప్పుడు నీ రూపం ఎలా ఉందో కూడా నాకు తెలియదు.. నీ ఆరోగ్య పరిస్థితి అసలే తెలియదు.. వందేళ్లు వచ్చినా నీ జ్ఞాపకాలను మదిలో ఉంచుకొని ఇన్నాళ్లు బతికాను.. నీకన్నా ముందుగా అడవికి వెళ్లిన నీ అన్న విగతజీవిగా 11 ఏళ్ల కిందట కనిపించి శోకసంద్రంలో ముంచాడు.. జీవితాంతం నాకు తోడుగా ఉంటానన్న మీ నాన్న 25 ఏళ్ల క్రితమే నన్ను వదిలివెళ్లాడు..
ఈ వయసులో బతకాలన్న కోరిక నాలో మిగిలి ఉందంటే అది నిన్ను చూడడమే.. నా కౌగిలిలో అక్కున చేర్చుకొని తనివి తీరా ఆనందించడం కోసమే.. నేను కన్ను మూసే నాటికైనా నిన్ను సజీవంగా చూడాలన్న ఈ తల్లి కొరిక మన్నించు.. ప్రపంచమంతా ధనిక, పేద తేడా లేకుండా కరోనా మహమ్మారితో అల్లాడి పోతున్నారు.. ఈ క్షణంలోనైనా నువ్వు లొంగిపోతే నీకు సర్కారు అన్ని రకాల సాయం చెస్తుంది.. వైద్యం అందిస్తుంది.. అంతకు మించి నా కొడుకును నా కళ్ల ముందు ఉంచినట్లవుతుంది.. ఇది దాదాపు 50 ఏళ్ల క్రితం ఉద్యమం పేరిట మావోయిస్టుల్లో కలిసిన అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌రావు తల్లి మధురమ్మ తుది శ్వాస విడిచే వరకు పడిన కొడుకు కోసం పడిన తపన..
కొడుకు కోసం తపిస్తూ చివరి కోరిక తీరకుండానే మావో అగ్రనేత తల్లి మధురమ్మ మంగళవారం అనంత లోకాలకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధురమ్మ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకు వెళ్లాలని సూచించడంతో బంధువులు మధురమ్మ స్వస్థలం పెద్దపల్లికి తరలించి, వెంటిలేటర్ తొలగించగానే మధురమ్మ తుదిశ్వాస విడిచారు. విగత జీవిగా మారిన మధురమ్మను చూసి ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు.
50 ఏళ్లుగా తల్లడిల్లిన మాతృమూర్తి..
1973లో మధురమ్మ రెండో కుమారుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు ఉద్యమ బాట పట్టగా, 1977లో చిన్న కుమారుడు వేణుగోపాల్‌రావు అడవిబాట పట్టి కనిపించకుండా పోయాడు. 1997లో తండ్రి మరణించినా వారు అంత్యక్రియలకు సైతం హాజరు కాలేదు. ఇల్లు విడిచిన నాటి నుంచి కనిపెంచిన కొడుకులు కనిపించకుండా పోయారు. 2011లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కోటేశ్వర్‌రావు అలియాస్ కిషన్‌జీ మృతిచెంది విగతజీవిగా రావడంతో కన్న కడుపు తల్లడిల్లింది. కనీసం చిన్న కుమారుడు వేణుగోపాల్‌రావునైనా సజీవంగా చూడాలని ఆ తల్లి ప్రాణం ఎంతో పరితపించింది.
జీవిత చరమాంకంలోనైనా నువ్వు ఉద్యమాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తావని పలుమార్లు వేణుగోపాల్‌రావును ఉద్దేశిస్తూ తల్లి మధురమ్మ విడియాతో తన చివరి కోరికను పంచుకుంది. చివరి రోజులలోనైనా తనతోపాటు కుటుంబ సభ్యులతో హాయిగా ఉండాలని కోరుకుంది. కని పెంచిన తల్లి రుణం తీర్చుకునేందుకైనా చివరి కోరిక మన్నించి అడవి బాట వీడి జనం బాట పట్టాలని మధురమ్మ ఎన్నోసార్లు కన్నీటి పర్యంతమైంది. అయితే చివరికి తన ఆశ తీరకుండానే మధురమ్మ తుదిశ్వాస విడవడం పలువురిని కంటి తడి పెట్టించింది.