Tuesday, November 19, 2024

TS: ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలి… మావోయిస్టు నేత వెంకటేశ్‌ లేఖ

పెద్దపల్లి, సెప్టెంబర్‌ 6 (ప్రభన్యూస్‌): ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసిన దళారులు బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యుపీ డివిజన్‌ కమిటీ కార్యదర్శి వెంకటేశ్‌ హెచ్చరించారు. బుధవారం మీడియాకు విడుదల చేసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేటకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులు బండారి శ్రీనివాస్‌ గౌడ్‌, బుషనవేని శ్రీనివాస్‌, శ్రీరాముల గోపాల్‌లు కలిసి ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాలు పట్టిస్తామని, పర్మినెంట్‌ అవుతాయని నమ్మించి 30మందికి పైగా అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. పేదలకు ఉద్యోగాల ఆశ చూపగా, అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకొని ఒక్కొక్కరు రూ. 4లక్షల నుంచి 6లక్షల వరకు దళారులకు ముట్టజెప్పగా, డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టించకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబ్బులు వాపస్‌ ఇవ్వాలని ప్రశ్నిస్తే ప్రభుత్వ అండదండలతో దిక్కున్న చోట చెప్పుకోండంటూ పోలీసులు, అధికార పార్టీ నాయకులతో బెదిరింపులకు గురి చేయడం, ఉల్టా కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించడం అన్యాయమన్నారు. బాధితులు ఎవరికి చెప్పినా డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పులు తీర్చలేక ఆస్తులు కోల్పోయి దినదినగండంగా బతుకులు గడుపుతున్నారన్నారు. ఇప్పటికైనా ఆర్‌ఎఫ్‌సీఎల్‌ బాధితులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే సదరు ముగ్గురు నాయకులు ప్రభుత్వ యంత్రాంగం అండతో భూ కబ్జాలు చేస్తూ, ప్రజల మధ్య భూ తగాదాలు సృష్టించి డబ్బులు తీసుకొని పంచాయతీలు చేయడం, వినని వారిపై కేసులు పెట్టించడం, ఇరువర్గాల మధ్య ఒప్పందం చేయించి డబ్బులు తీసుకోవడం దిన చర్యగా మార్చుకున్నట్లు తెలుస్తోందన్నారు.

- Advertisement -

గ్రామంలో దళితులపై సమస్యలు సృష్టించి, వారిపైనే దాడులకు కూడా పాల్పడ్డారని, తిరిగి పోలీసులకు చెప్పి గ్రామాన్ని దిగ్భంధించి దళితులను 4 రోజులపాటు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచి చిత్రహింసలకు గురి చేయడంతో పాటు ఉల్టా కేసులు పెట్టించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నాయకులంతా భూ కబ్జాలు, గుండాయిజం, భూ తగాదాలు సృష్టించి పంచాయతీలు చేయడం బంద్‌ చేయాలని హెచ్చరించారు. దళితులపై కేసులు ఉపసంహరించుకొని, వారికి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిచో ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement